తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ సుధాంశు దులియా ధర్మాసనం వైయస్ఆర్‌సీపీ నేతలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, వీళ్లందరూ విచారణకు సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారికి ఇవ్వాలని, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని సుప్రీం కోర్టు సూచించింది.
వైఎస్‌ఆర్ సీపీ నేతలకు బెయిల్ మంజూరైన తర్వాత ఆ పార్టీ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైస్ జగన్ తన కార్యకర్తలను, నాయకులను కాపాడుకుంటున్నారని, టీడీపీ గెలిచినప్పటి నుంచి ఫ్రధాన ప్రతిపక్షానికి చెందిన నాయకులను వెంటాడి వేటాడి హింసిస్తున్నారని పొన్నవోలు ఆరోపించారు. మూడు సంవత్సరాల క్రితం జరిగిన దాడికి సంబంధించి ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టి 128 మందిని ముద్దాయిలను చేసి హింసిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో సుప్రీంకోర్టు ఈ ముందస్తు బెయిల్ ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని, ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. మన కార్యకర్తలు, నాయకుల కోసం పోరాడాలని వైఎస్ జగన్ ఆదేశించారని, పోరాడేందుకు వైఎస్ జగన్ స్ఫూర్తినిచ్చారని, ఇందుకు ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త, నాయకులు గర్వించాలన్నారు.