ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అధికార పార్టీ నేతలకు, ముఖ్యంగా మంత్రులకు మార్చి నెల టెన్షన్ పట్టుకుంది. అదేదో ఎండల టెన్షన్ కాదు.. పొలిటికల్ టెన్షన్. మార్చి గండం ఎవరిని ముంచేస్తుందో అని మంత్రులు తెగ భయ పడిపోతున్నారు.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చినెలలో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత జనసేన నాయకుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉండటంతో ఈసారి మంత్రివర్గంలో కొందరు కొత్త వాళ్లకు అవకాశం ఇస్తారని జోరుగా తెలుగు దేశం పార్టీలో ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులకు మాత్రం పెద్దగా భయం లేదు.. కానీ, టీడీపీకి చెందిన మంత్రులే భయపడిపోతున్నారు.
ఏపీలో మంత్రి వర్గం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ కొందరు మంత్రులు తమ పనితీరులో వెనకబడి ఉన్నారన్న చర్చ జోరుగా నడుస్తోంది. సామాజికవర్గంతో పాటు వివిధ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన వారికి కూడా చంద్రబాబు తన మంత్రివర్గంలో ఈసారి చోటు కల్పించారు. యువకులయితే మరింత బాగా పనిచేస్తారని, తమకు కేటాయించిన శాఖలపై పట్టుసాధించడమే కాకుండా, తమకు అప్పగించిన జిల్లాలకు సంబంధించి కూటమి నేతల మధ్య సయోధ్య కుదురుస్తారని కూడా చంద్రబాబు గట్టిగా నమ్మారు. అంతేకాదు.. తనతో పాటు యువకులైతేనే పాలనలో పరుగులు పెడతారని కూడా చంద్రబాబు నమ్మకం పెట్టుకున్నారట. కానీ, చంద్రబాబు ఊహించిని దానికి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతోందంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని మంత్రులకు ర్యాంకులు కేటాయించారు. కనీసం ఫైళ్ల క్లియరెన్స్ విషయంలోనూ కొందరు మంత్రులు వెనకబడి ఉన్నారని తేలింది. మరికొందరు మంత్రులు కేవలం బుగ్గ కారులోనే తిరుగుతూ విపక్షం చేసే విమర్శలకు కూడా స్పందించడం లేదట. తన పేషీలపై కూడా పట్టులేకుండా కొందరు మంత్రులు వ్యవహరిస్తుండటాన్ని చంద్రబాబు గమనించారని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితులు గమనిస్తే.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో నలుగురైదుగురు మంత్రులపై వేటు పడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. వారి స్థానంలో సమర్థులైన వారిని నియమిస్తే పాలన గాడిలో పడుతుందని చంద్రబాబు విశ్వసిస్తున్నారట. అందుకే నాగబాబుతో పాటు కొత్తగా మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేయవచ్చునని, పాత మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు. ఇక, ఈ ప్రమాదాన్ని గమనించిన కొందరు మంత్రులు ఇప్పుడిప్పుడే ఆకస్మిక తనిఖీలు, విపక్ష నేతపై విమర్శలు వంటివి చేస్తున్నారట. జగన్‌ను తిడితే తమ పదవి పదిలంగా ఉంటుందని భావించి కొందరు అలా మాట్లాడుతున్నాని చెబుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం అన్నీ గమనిస్తున్నారని, అందుకు తగినట్లు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు.