PVRలో మూవీస్ చూసే వారికి ఇది తెలిసిన విషయమే. సినిమా చెప్పిన టైమ్ తర్వాత తక్కువలో తక్కువ 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ టైమ్‌లో అనేక యాడ్స్, ట్రైలర్స్ ప్రదర్శిస్తూనే ఉంటారు. ఒక్కోసారి కాస్త చిరాకుగా కూడా అనిపిస్తోంది. కానీ అందరం చిరాకు పడి ఊరుకుంటాం. కానీ బెంగళూరుకు చెందిన ఓ యువకుడు మాత్రం అలా ఊరుకోలేదు. ఏకంగా కోర్టులో కేసు వేశాడు. తన టైమ్ అంతా వృథా చేశారంటూ కోర్టును ఆశ్రయించాడు. మరో హైలేట్ విషయం ఏంటంటే కోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో PVRకు రూ.లక్ష ఫైన్.. బాధితుడికి రూ.28,000 పరిహారం వచ్చింది.
ఇంతకీ ఏం జరిగింది అంటే అభిషేక్ అనే బెంగళూరుకు చెందిన లాయర్ 2023లో శామ్ బహదూర్ మూవీ చూసేందుకు PVR INOXకు వెళ్లారు. బుక్ మైషోలో మూడు టికెట్లు బుక్ చేసుకున్నాడు. అందులో సాయంత్రం 4:05 గంటలకు సినిమా ప్రారంభమవుతుందని ఉంది. కానీ ఆ టైమ్‌కు యాడ్స్ ప్లే అవ్వడం ప్రారంభమయ్యాయి. సినిమా మాత్రం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమైంది. దీంతో సినిమా ముగిసే సమయానికి సాయంత్రం 6:30 గంటలు అయ్యింది. దీంతో అభిషేక్‌కు చిర్రెత్తుకొచ్చింది.
తాను సినిమా అయిపోగానే ఓ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్థామనుకున్నానని.. కానీ సినిమా ఆలస్యం అవ్వడం వల్ల ఆ పని కాలేదని తెలిపాడు అభిషేక్. తన సమయాన్ని వృథా చేయడమే గాకుండా తనకు మెంటల్ స్ట్రెస్ పెరిగేందుకు కారణమయ్యారంటూ PVR, Book My Showపై కేసు వేశాడు.
అయితే PVR తరపున కూడా బలంగానే వాదనలు వినిపించారు. తాము ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారమే యాడ్స్ ప్లే చేశామన్నారు. దీంతో చట్టాన్ని పరిశీలించిన కోర్టు కేవలం 10 నిమిషాలు మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుందని.. మీరు ప్లే చేసిన యాడ్స్‌లో కూడా 95 శాతం ప్రైవేట్ యాడ్సే ఉన్నాయని తెలిపింది. మరోసారి రీపిట్ చేయవద్దని లక్ష రూపాయల ఫైన్ విధించింది. అంతేగాకుండా అభిషేక్ ఇబ్బంది పడ్డందుకు 20 వేల రూపాయలు.. కోర్టు ఖర్చుల కోసం 8 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.