ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెల పొలిటికల్ హీట్ పుట్టించే అవకాశం కనిపిస్తోంది. రెండు ప్రధాన పార్టీలు తమ బలం నిరూపించుకునే పండుగలు చేసుకోబోతున్నాయి. ఆ కార్యక్రమాల కోసం ఆయా పార్టీల శ్రేణులు ఇప్పటినుంచే సమాయత్తమవుతున్నాయి. ఇక, ఏర్పాట్లకోసం ప్రత్యేక కమిటీలు కసరత్తులు ప్రారంభించాయి. ఆ రెండు పార్టీలు ఒకటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అయిన జనసేన కాగా.. మరొకటి ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. మార్చి 12వ తేదీన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. అదే సమయంలో మూడు రోజుల పాటు జనసేన ప్లీనరీకి కూడా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఏపీలో మార్చి నెలలో సమయంలో పొలిటికల్ హీట్ ఉండనుంది. ఇప్పుడిప్పుడే వేసవి ప్రారంభమైంది. మరోవైపు.. రాజకీయంగానూ వేడి రాజుకుంటోంది. ఈ సమయంలో రెండు పార్టీలకు సంబంధించిన కీలక కార్యక్రమాలు మార్చిలోనే ఉండటంతో.. రెండు పార్టీల సోషల్ మీడియా వింగ్‌లు కూడా యాక్టివ్ అయ్యాయి.
అధికార, విపక్షాలకు సంబంధించిన రెండు కార్యక్రమాలు ఒకేరోజు ఉండటం రాజకీయ సంచలనాలు చోటు చేసుకునే అవకాశం ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మార్చి 12వ తేదీ నుంచ ఇమూడు రోజలు పాటు ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని జనసేన పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఏర్పాట్లు, నిర్వహణ కోసం అవసరమైన కమిటీలు కూడా నియమించారు. ఆ కమిటీలు తమకు కేటాయించిన బాధ్యతల్లో నిమగ్నమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురంలో జనసేన పార్టీ ప్లీనరీ నిర్వహిస్తుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం కావడంతో ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. లక్షలాది మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేనకు ఈ ఎన్నికల్లో మంచి విజయం దక్కింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది జనసేన పార్టీ. అందుకే ఈ ప్లీనరీ జనసేనకు ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఇదే వేదికగా జనసేన సంచలన నిర్ణయాలు ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది. రాజకీయంగానూ కొన్ని వ్యూహాలు ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 12. 2012లో ఆ పార్టీ ఆవిర్భవించింది. పార్టీ ఆవిర్భవించి పుష్కరకాలం గడిచింది. ఈ యేడాది 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఆవిర్భవించిన తర్వాత తొలి ఆరేళ్ల పాటు బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్.. ఆ తర్వాత ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఇప్పుడా పార్టీ పరిస్థితి మారిపోయింది. గడిచిన ఐదేళ్ల పాటు ఉన్న జోష్.. ఆ పార్టీలో ఇప్పుడు కనిపించడం లేదు. కానీ, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం దూకుడుగా అడుగులు వేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ ఆవిర్భావ దినోత్సవం వేదికగా వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఉగాది నుంచి ప్రజల్లోకి వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలతో పాటు.. తటస్థ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేదికగా వైఎస్ జగన్.. కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.