32.6 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

ఎన్నికలొచ్చాయంటే ఎగ్జిట్‌పోల్స్‌ హవా – మరి.. ఇప్పుడు ఈ సర్వేలకేమైంది?

దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఎగ్జిట్‌ పోల్స్‌దే హవా కొనసాగడం రివాజు. ఎగ్జిట్‌ పోల్స్‌ కోసం, అవి విడుదలయ్యే సమయం కోసం కొందరైతే కళ్లల్లో వత్తులు వేసుకొని మరీ ఎదురుచూస్తుంటారు. ప్రతీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ముగిసిందంటే ఎగ్జిట్‌పోల్స్‌దే రాజ్యం. ఏ సంస్థ ఎవరికి మార్కులేసిందని, ఎవరి సర్వే ఏ పార్టీకి ఎడ్జ్‌ సూచిస్తుందన్న చర్చే రెండు రోజుల పాటు ముసురుకుంటుంది. అయితే, మరి.. ఎగ్జిట్‌పోల్స్‌కు స్పష్టత, ఖచ్చితత్వం మసక బారిపోతున్నాయా? సర్వేల లెక్కలు తప్పులో కాలేస్తున్నాయా? ఇవాల్టి మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌ ఏం చెప్పబోతున్నాయి? ”భాస్కర న్యూస్‌” ప్రత్యేక కథనంలో చూద్దాం…

ఇవాళ మహారాష్ట్ర, జార్ఖండ్‌లో పోలింగ్‌ ముగిసింది. జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. మహారాష్ట్రలో మాత్రం 288 నియోజకవర్గాలకు ఒకే విడతగా బుధవారం పోలింగ్‌ నిర్వహించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పోలింగ్‌ పర్వం పూర్తిగా ముగిసిపోవడంతో ఇక ఎగ్జిట్‌ పోల్స్‌ హవా మొదలయ్యింది. ప్రధానంగా ఎక్కువగా పాపులర్‌ అయిన, గతంలో కరెక్ట్‌ సర్వే రిజల్ట్‌ ఇచ్చిన సంస్థల సర్వేలకోసం ఇంటర్నెట్‌లో సెర్చింగ్‌ చేస్తున్నారు. అయితే, గడిచిన కొంత కాలంగా ఆయా సంస్థలు ఇస్తున్న సర్వే రిపోర్టులు అంచనాల లెక్కలు తప్పుతున్నాయి. బొక్కబోర్లా పడుతున్నాయి.

ఇటీవలే జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్‌ రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. హర్యానా, జమ్మూ కశ్మీర్‌.. రెండు రాష్ట్రాలలోనూ ఏ సర్వే సంస్థ చెప్పిన అంచనాలు కూడా నిజం కాలేదు. ఇది సర్వే సంస్థలకే కాదు.. రాజకీయ పార్టీలకు కూడా షాక్‌ కొట్టింది. హర్యానాలో అక్టోబర్‌ 5వ తేదీన ఎన్నికలు జరిగాయి. అయితే, జమ్మూ కశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1తేదీన మూడు విడతల్లో పోలింగ్‌ జరిగింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబర్‌ 8వ తేదీన వెలువడ్డాయి. అయితే, అక్టోబర్‌ 5వ తేదీన రెండు రాష్ట్రాల తుది విడత పోలింగ్‌ ముగిసిన వెంటనే ఆయా ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు రిపోర్టులు ప్రకటించేశాయి. వాటిలో ప్రధాన ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థల అంచనాలు ఇప్పుడు చూద్దాం…

హర్యానా అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌ :

ఇండియా టుడే-సీ ఓటర్
కాంగ్రెస్‌ పార్టీ – 50-58
బీజేపీ – 20-28

రిపబ్లిక్ భారత్ – మ్యాట్రిజ్
కాంగ్రెస్‌ పార్టీ – 55-62
బీజేపీ – 18-24

పీపుల్స్‌ పల్స్‌
కాంగ్రెస్‌ పార్టీ – 49-61
బీజేపీ – 20-32

దైనిక్‌ భాస్కర్‌
కాంగ్రెస్‌ పార్టీ – 44-54
బీజేపీ – 15-29

ధృవ్‌ రీసెర్చ్‌
కాంగ్రెస్‌ పార్టీ – 50-64
బీజేపీ – 22-32

సీఎన్ఎన్
కాంగ్రెస్‌ పార్టీ – 59
బీజేపీ – 21

అయితే, పై సంస్థలు కొంచెం అటూ ఇటూగా కాంగ్రెస్‌పార్టీకే హర్యానాలో జై కొట్టాయి. కొన్ని సంస్థలైతే బీజేపీకి కనీస స్థానాలు కూడా ఇవ్వలేదు. కానీ, ఎన్నికల తుది ఫలితాలు వచ్చాక అన్నీ తలకిందులయ్యాయి. ఏ ఒక్క సంస్థ కూడా బీజేపీ మూడోసారి హర్యానాలో గెలుస్తుందని చెప్పలేదు. కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. ఇక, జమ్మూ కశ్మీర్‌ విషయానికి వస్తే..అక్కడ కూడా ఆయా ఎగ్జిట్‌పోల్స్‌ సంస్థలు వేసిన అంచనాలు కూడా పనిచేయలేదు. అన్ని సంస్థలూ జమ్మూ కశ్మీర్‌లో హంగ్‌ వస్తుందని చెప్పాయి. కానీ, అక్కడ కూడా ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు బెడిసికొట్టాయి.

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎగ్జిట్‌ పోల్స్‌ :

ఇండియా టుడే-సీ ఓటర్
కాంగ్రెస్‌ పార్టీ – 40-48
బీజేపీ – 27-32

పీపుల్స్‌ పల్స్‌
కాంగ్రెస్‌ పార్టీ – 46-50
బీజేపీ – 23-27

దైనిక్‌ భాస్కర్‌
కాంగ్రెస్‌ పార్టీ – 35-40
బీజేపీ – 20-25

పై సంస్థలు హంగూ ఆర్భాటాలతో ఎగ్జిట్‌పోల్స్‌ రిపోర్ట్ ప్రకటించాయి. కానీ, ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక రియల్‌ రిపోర్ట్‌లో ఇవన్నీ పటాపంచలైపోయాయి. హర్యానాలో భారతీయ జనతాపార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్‌ సాధించింది. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్‌ – ఎన్‌సీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారిక ప్రకటన తర్వాత ఫైనల్‌ రిపోర్ట్‌ ప్రకారం ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో చూద్దాం…

హర్యానా అసెంబ్లీ ఫలితాలు :
బీజేపీ – 48
కాంగ్రెస్‌ – 37
ఐఎన్‌ఎల్‌డీ – 2
ఇండిపెండెంట్లు – 3

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఫలితాలు :
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ – 42
బీజేపీ – 29
కాంగ్రెస్‌ – 06
పీడీపీ – 03
జేపీసీ – 01
సీపీఎం – 01
ఆమ్‌ఆద్మీపార్టీ – 01
ఇండిపెండెంట్లు – 07

పోలింగ్‌ కేంద్రాల్లో ఓటేస్తున్న ఓటర్ల అభిప్రాయాన్ని తీసుకుని సర్వే సంస్థలు ముందుగానే ఓటర్ల నాడిని అంచనా వేసి.. ఏ పార్టీ, ఏ కూటమి విజయం సాధిస్తుందనే వివరాలు చెబుతూ ఉంటాయి. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్పిన సీట్లకు కొంచెం అటు ఇటూగా తుది ఫలితాలు వస్తుంటాయి. కానీ, కొన్నిసార్లు వాటి అంచనాలు తలకిందులు కూడా అయ్యే అవకాశాలున్నాయి. హర్యానా, జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల విషయంలో అదే జరిగింది. 9 సీట్లున్న హర్యానాలో కాంగ్రెస్‌ 50 స్థానాలకు పైగా విజయం సాధించి అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ సంస్థలు అంచనా వేశాయి. బీజేపీ హ్యాట్రిక్‌ సాధించలేదని అభిప్రాయపడ్డాయి. అధికార బీజేపీకి 30 సీట్లకంటే ఎక్కువ వచ్చే అవకాశమే లేదన్నాయి. కానీ, తుది ఫలితాల్లో అందరి అంచనాలు బోల్తాపడ్డాయి. అదే విధంగా జమ్మూ కశ్మీర్‌లో చూసుకుంటే.. హంగ్​ అసెంబ్లీ ఏర్పాటవుతుందని ఎగ్జిట్‌పోల్స్‌ అన్నీ అంచనా వేశాయి. కాంగ్రెస్​ – ఎన్​సీ కూటమి ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని భావించాయి. కానీ ప్రభుత్వం ఏర్పాటకు కావాల్సిన మెజారిటీని కూటమి సాధించింది.

గతంలోనూ కొన్నిసార్లు…
– అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎగ్జిట్‌పోల్స్‌ సంస్థల అంచనాలు తారుమారయ్యాయి. ఛత్తీస్‌గ్‌లో అన్ని సర్వేలూ కాంగ్రెస్‌పార్టీకి మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. కానీ, అక్కడ బీజేపీ గెలిచింది.
– అలాగే, పార్లమెంటు ఎన్నికల్లోనూ మూడోసారి బీజేపీకి 350కి పైగా సీట్లు వస్తాయని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్‌ సంస్థలు ప్రకటించాయి. కానీ, బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. కేంద్రంలో అధికారం ఏర్పాటు చేయడానికి అవసరమైన 272ఎంపీ సీట్లను కూడా సొంతంగా గెలుచుకోలేకపోయింది.
– 2023లో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కొన్ని చోట్ల ఎగ్జిట్​ పోల్స్ అంచనా లెక్క బెడిసికొట్టింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయం సాధించగా, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్​ పోల్స్‌ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడతాయని అంచనా వేశాయి. మరోవైపు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలానే జరిగింది. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పలు సర్వేలు తెలిపాయి. కొన్ని సర్వేలు చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
– 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఎగ్జిట్​ పోల్స్​ అన్నీ ఎన్​డీఏ 240-250 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ వాస్తవానికి 187 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.
– 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి ఎన్నిస్థానాల్లో గెలుస్తుందనే విషయాన్ని ఏ సంస్థ అంచనా వేయలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఎన్​డీఏ 300 స్థానాలో విజయదుందుభి మోగించింది. ఒక్క బీజేపీయే 272 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 44 సీట్లకే పరిమితమైంది.
– 2017లో జరిగిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్​ అసెంబ్లీ వస్తుందని సర్వేలు అంచనా వేశాయి. కానీ అందుకు భిన్నంగా బీజేపీ 325 స్థానాల్లో విజయఢంకా మోగించింది.
– 2015లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి, మహాకూటమికి మధ్య గట్టిపోటీ ఉంటుందని సర్వేలు అంచనా వేశాయి. కానీ ఎన్నికల్లో కూటమికి 178 సీట్లు వచ్చాయి. బీజేపీ ఓటమి పాలైంది.
– 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ గెలుస్తుందని సర్వేలు అంచనా వేసినప్పటికీ 70 సీట్లకు 67 స్థానాల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఇప్పుడేం జరగబోతోంది? :
ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు మరికొద్ది సేపట్లో బయటకు రానున్నాయి. వాటికోసం రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీల నాయకులు, సామాన్య పౌరులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి సర్వే సంస్థలు వేసే అంచనాలు నిజమవుతాయా, లేదంటే బొక్కబోర్లా పడతాయా? ఫైనల్‌ రిజల్ట్స్‌ రాగానే తెలిసిపోతుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com