- సంచలనం రేపుతున్న పిసిసి అధ్యక్షుని కామెంట్స్
- పార్టీలో అసంతృప్తి వాస్తవం అన్న మహేష్ గౌడ్
- పరిస్థితులు ఎందుకు చక్కబెట్టడం లేదని ప్రశ్నిస్తున్న సీనియర్లు
- కార్యవర్గం లేకపోవడమే సమస్యలు అంటున్న మరికొందరు
- త్వరలోనే అన్ని సెట్ చేస్తామంటున్న పిసిసి నేత
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షులు తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొంత మంది అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమని బహిరంగంగా ఆయన చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చిందనే అంశంపై చర్చ మొదలైంది. పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని సీనియర్లు సైతం అంగీకరిస్తున్నారు. అయితే ఆ అసంతృప్తి ఎందుకు ఉందనే విషయాన్ని కూడా తెలుసుకోవాలని వాళ్ళు సూచిస్తున్నారు. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండటం టిఆర్ఎస్ పార్టీని ఎదిరించి పోరాడిన నేతలకు సైతం ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లభించడం లేదనేది వాళ్ళ వాదన. ఈ పరిస్థితులు ఉన్నాయని అగ్ర నాయకత్వం సైతం అంగీకరించిన నేపథ్యంలో మరి వాటిని చక్కగా పెట్టే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు.
దీనికి తోడు ఈ అసంతృప్తి నేతలు ఇష్ట రాజ్యాంగా ప్రకటనలు చేస్తున్నారు. పార్టీకీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ప్రకటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గాంధీభవన్‌కు వచ్చిన తమకు ముఖ్య నేతలను కలిసే అవకాశం లభించడం లేదన్నది వారి వాదన. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి మాత్రమే గుర్తింపు లభిస్తోందని మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీని ఎప్పటి నుంచో అంటిపెట్టుకుని ఉన్న నేతలు విమర్శిస్తున్నారు. యూత్ కాంగ్రెస్‌కు సంబంధించి ఈ మధ్య చోటు చేసుకున్న పరిణామాలే అందుకు ఉదాహరణ అని వారు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా పరిస్థితులు మారుతాయని ఈ అసంతృప్తి నేతలు అంటున్నారు.
అయితే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అనుచరులు మాత్రం ఈ వాదనను తప్పుపడుతున్నారు. అధ్యక్షుడిగా నియమించినప్పటికీ ఇప్పటి వరకు కార్యవర్గాన్ని ప్రకటించలేదని దీనివల్లనే కొన్ని సమస్యలు వస్తున్నాయని వారు అంటున్నారు. అసంతృప్తికి కేవలం పిసిసి అధ్యక్షులే కారణమన్న వాదన సరైంది కాదని వారు గుర్తు చేస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా పిసిసి అధ్యక్షులు పార్టీలో కొంతమంది అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం అని చెప్పడం ద్వారా పార్టీ కేంద్ర నాయకత్వానికి కూడా ఒక మెసేజ్ పంపినట్టుగా వాళ్లు సమర్థించుకుంటున్నారు.