తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను దోస్త్ విధానం ద్వారా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లకు కూడా ‘జోస్ట్’ ద్వారా ఆన్‌లైన్ అడ్మిషన్ ప్రక్రియ 2025 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కసరత్తు చేస్తోంది. పదోతరగతిలో ఈ సారి గ్రేడింగ్ విధానం ఉండదు. గతంలో మాదిరిగానే మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నారు. ఆన్‌లైన్ అడ్మిషన్ల కోసమే మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. జోస్ట్ విధానంలో 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులు జూనియర్ కళాశాలలను ఆన్‌లైన్‌లో ఆప్షన్లు పెట్టుకోవచ్చు. అలాగే మెరిట్ ఆధారంగానే సీట్లను, కాలేజీలను కేటాయిస్తారు.
ఈ క్రమంలోనే తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి అనుబంధ గుర్తింపు కోసం నోటిఫికేషన్ కూడా ఇవ్వనందున.. ఇప్పుడే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టవద్దని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కళాశాలలకు అఫిలియేషన్ ఇచ్చిన తర్వాత గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామని, ప్రవేశాల షెడ్యూల్ జారీచేసిన తర్వాత వాటిలో మాత్రమే చేరాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు బోర్డు సూచించింది.
కళాశాలలు.. పీఆర్వోలను నియమించుకొని ఇప్పుడే ప్రవేశాలు చేపట్టాయని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త అకడమిక్ సెషన్‌కు ఇంటర్ బోర్డు ఇచ్చే షెడ్యూలు ప్రకారంగానే.. ప్రవేశాలు చేపట్టాలని, ఇందుకు విరుద్ధంగా ప్రవేశాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇంటర్ బోర్డు అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేయక ముందే కాలేజీలు ముందస్తు అడ్మిషన్లు చేపట్ట వద్దని జూనియర్ కాలేజీల యాజమన్యాలకు సూచించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
మరోవైపు.. తెలంగాణలో జోస్ట్ విధానం అమల్లోకి వస్తే.. ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఫీజుల సంగతి ఎలా అనేది సమస్యగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా ఫీజుల విషయంలో నియంత్రణ ఉండాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలో ఇంటర్‌తో పాటు ఎప్‌సెట్, జేఈఈ మెయిన్, నీట్ కోచింగ్‌లు అదనంగా ఇస్తుంటారు. వీటికి ఫీజులు కూడా విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ ఫీజుల విధానంపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.