- కేరళలో జడలు విప్పిన ర్యాగింగ్ భూతం…
- జూనియర్లపై నర్సింగ్ స్టూడెంట్ల ఘాతుకం
- ర్యాగింగ్ పేరుతో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లపై దాష్టీకం
- నగ్నంగా నిలబెట్టి, ప్రైవేట్ పార్ట్స్ కి డంబెల్స్ కట్టి..
- సూదులు, కంపాస్ తో గుచ్చి గుచ్చి గాయాలు
- మద్యం కొనుగోలుకు డబ్బులు లాక్కున్న సీనియర్లు
- మూడు నెలలుగా ఇదే నరకం
ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పింది. ఎన్నికఠిన చట్టాలు చేసినా, కెరీర్ నాశనమవుతుందని తెలిసినా విద్యార్ధులు ఈ ర్యాగింగ్ ఆగడాలకు పాల్పడుతూనే ఉన్నారు. అలాంటి సంఘటన ఒకటి కేరళలో వెలుగు చూసింది. కేరళ కొట్టాయంలో అయిదుగురు మెడికల్ కాలేజీ విద్యార్ధులు ర్యాగింగ్ పేరుతో సాగించిన అమానవీయ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇటీవల పోలీసులకు కంప్లయింట్ చేయడంతో వివరాలు బయటకొచ్చాయి. ఇదే కాలేజీలో మూడో ఏడాది నర్సింగ్ కోర్సు చేస్తున్న ముగ్గురు విద్యార్ధులు కొన్నినెలలుగా జూనియర్లను చిత్రహింసలకు గురిచేసిన ఘటనల తీరు వింటే ఒళ్లు జలదరిస్తోంది. బాధితులను ర్యాగింగ్ పేరుతో కొన్ని నెలలుగా భౌతికంగా, మానసికంగా వేధిస్తున్నట్లు వెల్లడైంది.
మూడు నెలలుగా నరకం…
గత ఏడాది నవంబర్లో కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లు జరిగాయి. అప్పుడు చేరిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు ముగ్గురిని అదే కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఐదుగురు సీనియర్లు ర్యాగింగ్ పేరుతో హింసాత్మక చర్యలకు ఒడిగట్టారు. వారిని నగ్నంగా మార్చి, వారి ప్రైవేట్ పార్ట్స్ కి డంబెల్స్ వేలాడదీసి చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాదు జామెట్రీ బాక్స్ లో కంపాస్, ఇతర పదునైన పరికరాలను తీసి వాటితో వారి ప్రైవేట్ భాగాలలో పొడిచి,గాయపరచి పైశాచికానందం పొందారు. మూడు నెలలుగా ఇదే తంతని, తమను రక్తమొచ్చేలా కొడుతున్నారని వారు పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
గాయాలకు మండే లేపనం…
ఆ నరరూప రాక్షసుల పైశాచికత్వం అక్కడితో ఆగలేదు. గాయపడిన భాగాలపై మండిపోయే లోషన్లు పూశారు. బాధితులు కేకలు,పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే వీరు నవ్వుతూ ఆ లోషన్ ను వారి నోట్లో కూడా అద్దారు. ఇంత దారుణంగా వ్యవహరించడమేకాక దీన్నంతటిని వీడియో తీసి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.వారి అకడమిక్ కెరీర్ కూడా దెబ్బతీస్తామని బెదిరించారు. ఆదివారాలొస్తే చాలు.. తమకు నరకమేనని బెదిరించి,కొట్టి మద్యం తాగడానికి డబ్బులు లాక్కునే వారని బాధితులు వాపోయారు. దెబ్బలకు తాళలేక ఓ విద్యార్ధి తండ్రికి సమాచారమివ్వడంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేలా తండ్రి ధైర్యం చెప్పాడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశముంది.
వేధింపుల పరంపర
కోచిలో స్నేహితులు బాడీ షేమింగ్ చేయడం భరించలేక ఓ15 ఏళ్ల స్కూలు విద్యార్ధి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. సహచర స్నేహితులు అమానించడం వల్లనే తన కొడుకు చనిపోయాడని మరణించిన విద్యార్ధి తల్లి వాపోయింది. ఈఘటన జరిగిన వారానికే నర్సింగ్ కాలేజీ విద్యార్ధుల ర్యాగింగ్ ఆగడాలు బయటపడటం కలకలం రేపుతోంది.