సీఎం రేవంత్ రెడ్డితో ముగిసిన మందకృష్ణ మాదిగ భేటీ. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ ను అభినందించిన మందకృష్ణ మాదిగ. ఒక కమిట్ మెంట్ తో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని మందకృష్ణ మాదిగ ప్రకటించారు.
హైదరాబాద్, జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో MRPS అధ్యక్షుడు మందకృష్ణ ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు మందకృష్ణ మాదిగ వివరించగా…రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్ లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని సీఎం వివరించారు. దీనివల్ల ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని ప్రతినిధులు గుర్తు చేశారు. సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు.