అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అక్రమ వలసదారులకు చెక్ పెడుతున్నారు. అక్రమంగా వచ్చే వారిని గుర్తించి వారిని అరెస్ట్ చేసి సొంత ఖర్చులతో వారి వారి సొంత దేశాలకు అమెరికా యుద్ధ విమానాల్లో తరలిస్తున్నారు. ఇప్పుడిదే విధానాన్ని ఫాలో అయ్యేందుకు రెడీ అవుతోంది యూనైటెడ్ కింగ్‌డమ్. దేశంలో ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారో లెక్క తెలుస్తూ అరెస్ట్‌ల పర్వం మొదలు పెట్టింది.
అక్రమ వలసదారులను గుర్తించేందుకు ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్స్‌పై ఫోకస్ చేసింది యూకే. జనవరిలో 828 ప్రాంతాల్లో తనిఖీలు చేసి 609 మందిని అరెస్ట్ చేశారు బ్రిటన్ పోలీసులు. తనిఖీల విషయంలో గతేడాది జనవరితో పోలిస్తే 48 శాతం ఎక్కువ. ఇక అరెస్టుల విషయానికి వస్తే ఏకంగా 73 శాతం అధికం. ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్లు, నెయిల్ బార్లు, కార్ వాష్ సెంటర్లపై ఫోకస్ చేశారు అధికారులు. అంతేకాదు ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో ఏకంగా ఏడుగురు అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి.. అందులో నలుగురిని ఇండియాకు కూడా పంపించివేశారు.
ఇకపై బ్రిటన్‌లో అక్రమవలసదారులకు చెక్ పెడతామన్నారు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్. దీని కోసం# ఏకంగా ఓ కొత్త బిల్లును తీసుకొస్తున్నారు. ఈ బిల్లు భద్రతా సిబ్బందికి మరిన్ని అధికారులు కట్టబెట్టనుంది. అంతేకాదు అక్రమ వలసదారులను పనిలో పెట్టుకునే యజమానులపై కూడా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది యూకే. అక్రమంగా చొరబడేందుకు వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారని.. అదే సమయంలో ఇలా రావడం.. ఇక్కడ పనులు చేయడం దేశ రక్షణకు, ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని చెబుతున్నారు అక్కడి అధికారులు. గతేడాది ఇంగ్లిస్ ఛానల్ దాటి 38 వేలకు పైగా మంది బ్రిటన్‌లోకి వచ్చారని.. ఈ ప్రయాణ సమయంలో 70 మంది మృతి చెందారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు 4 వేల మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.