తండేల్ సినిమా టాకీసుల్లో మారుమోగిపోతోంది. థియేటర్లలో, బయటా.. హిట్ టాక్ అందుకుంది. అటు.. సముద్ర తీర ప్రాంతాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా పేరు మారుమోగిపోతోంది. నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది.
శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల సమస్యలే సబ్జెక్ట్‌గా రూపొందించిన తండేల్ సినిమా అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల బాధలను కళ్లకు కట్టినట్టు చూపించింది. 2018లో తెలియకుండా సరిహద్దులు దాటి పాకిస్తాన్ చేతిలో బందీలుగా మారిన శ్రీకాకుళం మత్స్యకారుల జీవిత గాథను తండేల్ సినిమాగా తెరకెక్కించారు. ఈ క్రమంలోనే సిక్కోలు జిల్లాలో మత్స్యకారులు స్థానికంగా ఉన్న ప్రాంతాల్లో ఉపాధి దొరక్కపోవడంతో పాటు.. వేట గిట్టుబాటు కాక పోవడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న అంశాన్ని ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో చాటి చెప్పింది ఈ సినిమా.
శ్రీకాకుళం జిల్లా పూర్తిగా సముద్ర తీరంలోనే ఉంటుంది. మొత్తంగా 193 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న జిల్లా శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా చూస్తే.. వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే.. అందులో ఎక్కువభాగం అంటే.. దాదాపు 20శాతం శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. రణస్థలం మండలం ధోనిపేట నుంచి సముద్రతీరప్రాంతం.. ఇచ్చాపురం మండలం డుంకూరు దాకా విస్తరించింది. జిల్లాలోని 11 మండలాల్లో సముద్ర తీర ప్రాంతం ఉండగా.. శ్రీకాకుళం జిల్లా పరిదిలోనే సముద్ర తీరంలో 104 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో 2 లక్షల మంది దాకా మత్స్యకార జనాభా ఉన్నారు. అయినప్పటికీ.. మత్స్యకారులు తాము నివసిస్తున్న ప్రాంతంలో వేట కొన సాగించలేని పరిస్థితిలో వలస బాట పట్టడం అనివార్యమవుతోంది. కేవలం 50 సంవత్సరాలు పైబడిన వాళ్లు మాత్రమే జిల్లాలో తాము నివసిస్తున్న ప్రాంతాల్లో వేట సాగిస్తున్నారు. అయితే, తీర ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ మత్స్యకారులకు సంబంధించిన కుటంబాలకు చెందిన యువకులు ఉపాధి బాట పట్టడం నిత్యకృత్యంగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లానుంచి ఉపాధి కోసం వలస వెళ్తున్నవాళ్లు.. గుజరాత్‌లోని వీరావల్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక్కడి సముద్ర తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ప్రతి యేటా ఆగస్ నెలలో తమ గ్రామం నుంచి ఉపాధి వెతుక్కుంటూ బయలుదేరి వెళ్తారు. తర్వాత తదుపరి యేడు మార్చి నెలలో స్వగ్రామాలకు తిరిగి వస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఇతర ప్రాంతాల్లో కాంట్రాక్టర్ల వద్ద పనిలో చేరతారు. ఈ క్రమంలోనే ప్రమాదకరస్థాయిలో వేట కొనసాగిస్తుంటారు. ఈ వేట సాగించే క్రమంలో సరైన భద్రతా చర్యలు లేక.. ప్రమాదాల్లో మృత్యువాత కూడా పడుతుంటారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి సరిహద్దు జలాల్లోకి ప్రవేశించి విదేశీ బందీలుగా కూడా మారుతుంటారు. వాస్తవానికి శ్రీకాకుళంజిల్లా మత్స్యకారులు ఒక్క బంగాళాఖాతంలోనే కాదు. హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రంలో కూడా చేపల వేటకు వెళ్తారు. సిక్కోలు జిల్లాలో సుదూర సముద్ర తీర ప్రాంతం ఉన్నప్పటికీ.. సరైన హార్బర్ కానీ, పోర్టు కానీ, కనీసం జెట్టి కానీ అందుబాటులో లేవు. అదే ఇతర ప్రాంతాల్లో చూస్తే.. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక జెట్టి ఉంటుంది. కానీ, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఏవీ లేవు. అందుకే ఇక్కడ మత్స్యకార యువకులు అనివార్యంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారు. ఈ లెక్కన చూసుకుంటే.. శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి గ్రామంలో తండేల్ కథ రిపీట్ అవుతూనే ఉంటుందన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది.