38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

అమలుచేయడంలో విజయం – చెప్పుకోవడంలో విఫలం

  • తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ దీన పరిస్థితి

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి యేడాది గడిచింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు దాదాపుగా అమలు చేస్తోంది. అన్నింటికీ మించి.. అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారెంటీలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ప్రజా సంక్షేమ పథకాలపేరుతో ప్రజా ప్రభుత్వం పేరుతో అట్టహాసంగా సభలు పెట్టి మరీ ప్రజలను భాగస్వాములను చేస్తోంది. అంతేకాదు.. అధికారంలోకి రాకముందు వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలపైనా దృష్టి సారిస్తోంది. చెప్పినవన్నీ చేస్తోంది. ఇందులో భాగంగానే.. బీసీల కులగణనను విజయవంతంగా పూర్తిచేసింది. ఎస్సీల వర్గీకరణ అంశానికి కూడా బూజు దులిపింది. కానీ, ఇవన్నీ చేస్తున్నా.. ప్రచారంలో మాత్రం వెనకబడిపోతోంది. ప్రజల్లోకి తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రికార్డు స్థాయిలో చేపడుతున్న కార్యక్రమాల గురించి చేసినంత స్థాయిలో చెప్పుకోవడంలో విఫలమవుతోంది.

ఎంత చేస్తున్నా.. ప్రతికూల ప్రచారమే :

చెప్పిన, చేసిన పనులకు సంబంధించి అనుకూల ప్రచారం రాకపోయినా పర్వాలేదు గానీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలంగాణలో వింత పరిస్థితి ఎదురవుతోంది. నెగెటివ్‌ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. దశాబ్దాలుగా చేయని, ఎవరూ సాహసించని నిర్ణయాలు తీసుకున్నా.. ప్రయోజనం పొందుతున్న వర్గాల నుంచి కూడా అనుకూల ప్రకటనలు గానీ, ప్రశంసలు గానీ రావడం లేదు. పైగా వాళ్ల నుంచే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలు ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమిస్తున్నాయి.

రుణమాఫీ చేసినా రాని మైలేజీ :

కాంగ్రెస్‌పార్టీ గత సెప్టెంబర్‌లో రెండు లక్షల రూపాయల దాకా రైతులకు రుణమాఫీ చేసింది. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఎదురుచూపులకే పరిమితమైన రైతులు సంతోషపడ్డారు. కానీ, ఎక్కడో చిన్న టెక్నికల్‌ మిస్టేక్‌ను పట్టుకొని బీఆర్‌ఎస్‌ నాయకులు గానీ, ఆ పార్టీ సోషల్ మీడియా గానీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. ఆ అంశంలో ప్రభుత్వానికి పాజిటివ్‌ ప్రచారం కంటే నెగెటివ్‌ ప్రచారమే ఎక్కువయ్యింది.

రైతు భరోసాపై సొంత నేతల నెగెటివ్‌ టాక్స్‌ :

మొన్నటికి మొన్న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన రైతు భరోసా డబ్బుల పంపిణీ కూడా ప్రభుత్వానికి తేవాల్సినంత ప్రాభవం తీసుకురాలేదు. పైగా సొంత పార్టీ ఎమ్మెల్యే, సాక్షాత్తూ మంత్రి సోదరుడైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఆ పథకం ప్రారంభోత్సవ వేదికపై నుంచే పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. రైతు భరోసా నిధులు ఒక విడత డుమ్కీ కొట్టామని, జనం ఊళ్లలోకి వెళ్లే తిడుతున్నారని, కేసీఆర్‌ ఉన్నప్పుడే బాగుండేదంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది.

రేషన్‌ కార్డులతోనైనా రాని పేరు :

ఇక, రేషన్‌ కార్డుల అంశం చూసుకున్నా.. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో మంజూరు చేసిన రేషన్‌ కార్డులు మాత్రమే ఇప్పటికీ లబ్దిదారులకు పనికొస్తున్నాయి. పదకొండేళ్ల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. రిపబ్లిక్‌డే నాడు అట్టహాసంగా అన్ని మండల కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు.. ఊరించిన రేషన్‌కార్డులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రజలు రేషన్‌కార్డుల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూశారు. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజీ రాలేదు. అసలు ఈ స్థాయిలో ప్రజలకు మేలు చేస్తున్నామని ఒకరిద్దరు మినహా చెప్పుకున్న వాళ్లే కరువయ్యారు. దీంతో, ఈ అతిపెద్ద ప్రాజెక్టు ప్రజల్లోకి అంతగా వెళ్లలేకపోయింది.

కులగణన సర్వేపై బూమరాంగ్‌ :

దేశానికి స్వాతంత్ర్యం లభించిన నాటినుంచి ఎవరూ చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసింది. కులగణన సర్వే చేపట్టింది. సామాజిక వర్గాల వారీగా జనాభా లెక్కలను తేల్చింది. కానీ, ఆ లెక్కలు ప్రకటన తర్వాత ప్రభుత్వానికే బూమరాంగ్‌ అయ్యింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌.. అలర్ట్‌ అయ్యింది. బీసీ సంఘాలు, బీసీ నాయకుల్లో ఆజ్యం పోసింది. దీంతో బీసీల లెక్కల కోసమే ప్రధానంగా సర్వే చేయించామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌పార్టీ ఆ బీసీల నుంచే విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి 2014లో అప్పటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా సకల జనుల సర్వే చేపట్టింది. కానీ, ఆ లెక్కలు బయటకు ప్రకటించలేదు. రహస్యంగా భద్రపరుచుకుంది. అలాంటి బీఆర్‌ఎస్‌ పార్టీయే ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ చేసిన కులగణను తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. అప్పటి సర్వే రిపోర్టు కూడా ప్రకటించని బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిందిస్తోంది. ఇటు.. కాంగ్రెస్‌పార్టీ చేసిన పనిని కూడా చెప్పాల్సినంత స్థాయిలో చెప్పుకోలేక కుదేలవుతోంది.

ఎస్సీల వర్గీకరణపైనా విమర్శలే :

అంతేకాదు.. ఎస్సీల వర్గీకరణ అంశం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. దశాబ్దాల తరబడి డిమాండ్‌గానే ఉంటున్న ఎస్సీల వర్గీకరణ నిర్ణయం ఒకరకంగా సాహసోపేతం. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అయినా ఆ నిర్ణయాన్ని తీసుకుంది. కానీ, మొదటినుంచీ ఎవరైతే ఎస్సీల వర్గీకరణ కావాలంటూ పోరాడుతున్నారో.. ఆ మందకృష్ణ మాదిగే… కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓవైపు వర్గీకరణ అంశంపై మాల సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండగా.. వీటితో లబ్ది పొందుతోన్న మాదిగ సామాజిక వర్గం నేతలు కూడా విమర్శించడం, తమకు ఆశించినంత, జనాభాకు తగినంతగా రిజర్వేషన్లు ప్రతిపాదించలేదని ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌ పెద్దలను తలలు పట్టుకునేలా చేస్తోంది.

లోపం ఎక్కడుంది? :

ఎంత చేసినా విమర్శలు, ప్రతికూల ప్రచారాన్నే మూలగట్టుకుంటోంది రేవంత్‌ సర్కార్‌. రాజకీయ పార్టీలు గోరంత చేస్తేనే కొండంత చెప్పుకుంటాయనేది నానుడి. కానీ, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఎవరూ చేయలేని, దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు తీసుకోలేని నిర్ణయాలను సాహసోపేతంగా తీసుకుంటోంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కానీ, వాటిని చెప్పుకోవాల్సినంత స్థాయిలో చెప్పుకోవడం లేదు. ఏది చేసినా నెగెటివ్‌ ప్రచారమే ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. మరి.. పాజిటివ్‌గా ప్రచారం చేసుకోలేకపోవడంలో లోపం ఎక్కడుంది? ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య సమన్వయం లేదా? పార్టీలోనూ అంతగా పట్టింపు లేదా? వీటిని పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించుకోలేదా? ఇటు ప్రభుత్వం గానీ, అటు పార్టీ గానీ ఎక్కడ వైఫల్యం చెందుతోంది? ఇప్పటికైనా రేవంత్‌ ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి సారిస్తే లోకల్‌ బాడీ ఎన్నికల నాటికైనా ప్రజల్లోకి పాజిటివ్‌ వేవ్స్‌ తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. లేదంటే జరగబోయే నష్టం గురించి తర్వాత సమీక్షలు చేసుకోవాల్సి ఉంటుందేమో?

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com