- ఢిల్లీకి వెళ్లకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలు
- న్యాయపోరాటం చేస్తామంటున్న ఎమ్మెల్యేలు
- దానం నాగేందర్ ఇంట్లో భేటీ
- గురువారం ఢిల్లీ వెళ్ళనున్న కేటీఆర్
- ఈ వారంలోనే సుప్రీంకోర్టులో విచారణ
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణ పై దృష్టి సారించారు. ఫిరాయింపుల వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉండడంతో లీగల్ గానే ఈ అంశాన్ని ఎదుర్కోవాలని పది మంది ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఫిరాయింపులపై స్పందించడం అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శి కూడా నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో పదిమంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లుగా తెలిసింది. అసెంబ్లీ కార్యదర్శి నోటీసుల నేపథ్యంలో లీగల్ గా ఉన్న అంశాలు ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చించారు.
సుప్రీంకోర్టులో కేసు రానున్న నేపద్యంలో ఢిల్లీకి వెళ్లాలని ఈ పది మంది ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లుగా తెలిసింది. దీనికి దానం నాగేందర్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతానికి కొంత గడువు కోరి తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాలని అంశాన్ని పరిశీలిస్తామని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం కొత్త కాదని వివిధ రాష్ట్రాల్లో వీటిపై న్యాయస్థానాల్లో జరిగిన వాదనలు సుప్రీంకోర్టు కేసు కు సంబంధించిన వివరాలను ఎమ్మెల్యేలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని వారు అంటున్నారు. ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో చర్చించేందుకు ఈ ఎమ్మెల్యేల బృందం ఢిల్లీ వెళ్ళనుంది.
మరోవైపు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గురువారం ఢిల్లీ వెళ్ళనున్నారు. సుప్రీంకోర్టులో ఫిరాయింపుల కేసు రానున్న నేపథ్యంలో అక్కడే సీనియర్ అడ్వకేట్ లతో మాట్లాడి ఈ కేసును బలంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. రెండు మూడు రోజుల పాటు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండి స్వయంగా అడ్వకేట్ లతో మంతనాలు జరుపుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఫిరాయింపు శాసనసభ్యులను ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయించి ఎట్టి పరిస్ధితుల్లో ఉప ఎన్నికలు వచ్చే పరిస్ధితి తీసుకురావాలని బిఆర్ఎస్ భావిస్తుంది. ఇందుకు అనుగుణంగానే న్యాయపరమైన పోరాటం చేస్తున్నట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఉప ఎన్నికలు వస్తే మొత్తం పది స్థానాల్లో తామే గెలుస్తామన్న ధీమాతో బిఆర్ఎస్ అగ్రనాయకత్వం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న చట్టం వల్ల వెంటనే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులపై సంవత్సరాల కొద్దీ విచారణ జరిగిన సందర్భాలను వారు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు అదేవిధంగా బిఆర్ఎస్ బృందం కూడా ఢిల్లీకి వెళ్లి దీనిపైన ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.