38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

తెలంగాణ కులగణన డాక్యుమెంట్‌ ఓ రెఫరెన్స్‌ – సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక స్థాయిలో చేపట్టి కులగణన డాక్యుమెంట్‌ను భవిష్యత్తులో ఓ రెఫరెన్స్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఇవాళ్టిరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమగ్ర కులగణన రిపోర్ట్‌ దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఫలితంగా ప్రదానమంత్రి నరేంద్రమోదీపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర కుల సర్వే నివేదికను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా సర్వేలో ఉన్న అంశాలను సభాముఖంగా బహిర్గతం చేయడంతో పాటు.. పలు అంశాలపై మాట్లాడారు. తెలంగాణలో జరిగిన సర్వే రిపోర్ట్‌ ప్రకటించడంతో.. అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయాలన్న డిమాండ్‌ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సర్వే కారణంగా బీసీ, ఎస్సీలు, మైనార్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. 2011 జనాభా లెక్కల తర్వాత భారతదేశంలో తాము మాత్రమే ఇప్పుడు తెలంగాణలో ఈ సర్వే చేశామన్నారు. 2014లో అప్పటి బీఆర్ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే లెక్కలు ఎక్కడ ఉన్నాయో… ఆ సర్వే చేయించిన వాళ్లే చెప్పాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఆదేశాల మేరకు కమిషన్‌ వేశామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అసలు అసెంబ్లీకి రానివాళ్లు కూడా సమయం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మరికొందరేమో ఉప ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. సిరిసిల్లలో కేటీఆర్‌ సూసైడ్‌ చేసుకుంటాడేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 2014లో చేసిన సమగ్ర కుటుంబసర్వే ఎవరు చేశారోఉ, ఎలా చేశారో, ఆ నివేదిక ఎక్కడ పెట్టారో ఎవరికీ తెలియదన్నారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదని, అభివృద్ధి ఫలాలు అర్హులైన వాళ్లందరికీ అందించడం కోసమే తమ తాపత్రయం అన్నారు.

దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం ఎక్కడా లేదన్నారు రేవంత్‌రెడ్డి. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉందన్నారు. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదన్నారు. జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదని చెప్పారు. అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారని.. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. కులగణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారని తెలిపారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్‌గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించామన్నారు. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారని సీఎం వెల్లడించారు. రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించామన్నారు. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకే కేబినెట్ ఆమోదం తరువాత.. ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టామన్నారు. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ చెప్పారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం రేవంత్‌ ప్రకటించారు.

కెసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పద్మారావు, డీకే అరుణ తదితరులు కులగణన సర్వేలో పాల్గొనలేదని సీఎం రేవంత్‌ చెప్పారు. భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందనే కేసిఆర్ కుటుంబం సర్వేలో పాల్గొనలేదన్నారు. బీఆర్‌ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే అధికారిక డాక్యుమెంట్ అయితే నివేదికను ఎందుకు కేబినెట్ లో పెట్టలేదని రేవంత్‌ ప్రశ్నించారు. ఎందుకు అసెంబ్లీలో పెట్టలేదన్నారు. ఎందుకు నివేదికను ఒక కుటుంబం గుప్పిట్లో పెట్టుకుందని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు దీనికి సిద్ధమా? అని రేవంత్‌ ప్రశ్నించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com