సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ మంగళవారం తిరుమలలో రథసప్తమి వేడుకులు వైభవంగా నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా సప్తవాహనంపై వచ్చే స్వామివారిని వీక్షించడానికి అశేషంగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. రెండు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని ముందుగానే అంచనా వేసిన టీటీడీ బోర్డు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్త్రతమైన ఏర్పాట్లు చేసింది. భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా గ్యాలరీల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. దాదాపు 130 గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి సరఫరా చేయడానికి తగిన ఏర్పాట్లు చేసింది టీటీడీ బోర్డ్. భక్తుల సంఖ్య అపరిమితంగా ఉండే అవకాశం ఉండటంతో అందరూ గ్యాలరీల్లోకి చేరుకోలేరుకాబట్టి గ్యాలరీ బయట తిరుమల ఆవరణలో ఉండే భక్తులు వాహన సేవలు తిలకించడానికి ఎల్ఇడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించింది టీటీడీ బోర్డు.
- Advertisement with us -