హిందూపురం మున్సిపల్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఆరో వార్డు కౌన్సిలర్ రమేశ్ కుమార్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. చేతులెత్తే విధానంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఎన్డీఏ కూటమికి ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిపి 23 మంది బలం ఉండటంతో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ముగ్గురు కౌన్సిలర్లు ఎన్నికకు హాజరుకాలేదు.ఆరు నెలల క్రితం వైసీపీ ఛైర్పర్సన్ ఇంద్రజ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
హిందూపురం మున్సిపల్ చైర్మన్‌గా ఓటింగ్‌లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 21 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి టీడీపీకి 23 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీకి 17 స్థానాలు ఉంటే అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ముగ్గురు సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో టీడీపీకే మున్సిపల్ ఛైర్మన్ సీటు దక్కింది. రమేష్‌ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మున్సిపల్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డుల్లో వైఎస్సార్సీపీ 30 స్థానాలను గెలుచుకుంటే.. టీడీపీ 6, బీజేపీ, ఎంఐఎం చెరో స్థానంలో గెలిచారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో హిందూపురం మున్సిపాలిటీలో పరిస్థితి మారిపోయింది. ఏకంగా 14మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే వైఎస్సార్సీపీ మున్సిపల్ ఛైర్పర్సన్ ఇంద్రజ తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ పదవి ఖాళీ అయ్యింది. దీంతో మున్సిపల్ ఛైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహిస్తుండటంతో టీడీపీ కౌన్సిలర్లను బెంగళూరు క్యాంపునకు తరలించారు. ఇవాళ జరిగిన ఎన్నికల్లో హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ ఖాతాలోకి చేరింది.