నందిగామ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక పోవడంతో చైర్పర్సన్ ఎన్నిక నిర్వహణ రేపటికి వాయిదా వేశారు ఎన్నికల అధికారి, ఆర్డీవో బాలకృష్ణ. ఇవాళ అవసరమైనంత మంది సభ్యులు సకాలంలో హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది. రేపు ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటించారు.
వాస్తవానికి ఇవాళ ఉదయం 11 గంటలకు సభ్యులు హజరు కావాలని ఎన్నికల అధికారి బాలకృష్ణ ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎన్నికల అధికారి బాలకృష్ణ వేచిచూశారు. అయితే, వైసీపీ సభ్యులు మాత్రమే సమయానికి హాజరయ్యారు. వాళ్లు మినహా టీడీపీ, జనసేన సభ్యులు ఎన్నికకు హాజరుకాలేదు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన సభ్యులు.. ఎమ్మెల్యే తంగారాల సౌమ్య నివాసంలో భేటీ అయ్యారు. ఛైర్పర్సన్ అభ్యర్ధి పేరు ఖరారులో ఏకాభిప్రాయం కుదరకపోవడమే సభ్యులు హాజరు కాకపోవడానికి కారణంగా చెబుతున్నారు. పార్టీ అధిష్టానం సూచించిన పేరుపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విముఖంగా ఉన్నారని తెలుస్తోంది. అధిష్టానం నుంచి వచ్చిన మున్సిపల్ చైర్మన్ బీఫాంలో శాఖమూరి స్వర్ణలత పేరు ఉంది. అయితే, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.. బీఫాం మార్చాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన కౌన్సిలర్లతో తన కార్యాలయంలో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు.
మరోవైపు.. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎన్నిక సమయం ముగియడంతో కోరం లేక ఎన్నికను వాయిదా వేశారు. అటు.. నందిగామ మున్సపల్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహణ నిలిపివేయాలంటూ హైకోర్టులో వైసీపీ కౌన్సిలర్లు పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్ల ఖాళీలకు తొలుత ఎన్నికలు నిర్వహించాలని, ఆ పిటిషన్లో కౌన్సిలర్లు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.