– మా కొడుకును చంపారన్న బాధితులు
– మీ పేరే చెబుతున్నారంటూ ఆవేదన
– నేరుగా అడగడంతో మంత్రికి షాక్
– పోలీసులను కలవాలన్న మంత్రి
– పోలీసులు బెదిరిస్తున్నారన్న బాధితులు
– వాళ్ల చుట్టూ తిరిగి అలసిపోయామని వేడుకోలు
– నేరుగా సీఐని చూపిస్తూ బాధితుల ఆరోపణ
– సముదాయించలేక ఇబ్బంది పడ్డ మంత్రి
– పరిష్కారం చూపించకుండానే వెళ్లిపోయిన పొంగులేటి
రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఖమ్మం జిల్లా పర్యటనలో పలువురు బాధితులు మంత్రిని కలిశారు. వాహనంలో వెళ్తున్న మంత్రిని ఆపి తమ బాధలు విన్నవించుకున్నారు. అయితే, ఆ సమయంలో మంత్రి పొంగులేటికి ఊహించని పరిణామం ఎదురయ్యింది. కాసేపు ఆయన ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి తలెత్తింది.
మంత్రికి, బాధితులకు మధ్య జరిగిన సంభాషణ చూద్దాం… :
ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి రాత్రివేళ తిరిగెళ్తుండగా కొందరు బాధితులు ఆయనకు తమ గోడు వెల్లబోసుకున్నారు. వాళ్లు చెబుతున్నది వినేందుకు మంత్రి వాహనం ఆపారు.
ఆ సమయంలో బాధితులు మంత్రికి విషయం చెబుతుండగా.. ఒక్కరే చెప్పండి. అర్థమయ్యేలా చెప్పండి అని మంత్రి అడిగారు.
దీంతో, ఓ మహిళ.. ‘నా కొడుకును చంపారయ్యా.. పది మంది కలిసి చంపారు.’ అనగానే మంత్రి పొంగులేటి… ‘ఏం జరిగిందో తెలుసుకోండి’ అని అక్కడే ఉన్న పోలీసులను మంత్రి ఆదేశించారు.
ఆ వెంటనే.. బాధితులు ‘మీపేరే చెబుతున్నారు.. మీ పేరే చెబుతున్నారు సార్.. వాళ్లు మీ పేరే చెబుతున్నారు.. ‘ అని పదే పదే చెప్పారు.
దీంతో, విస్తుపోయిన మంత్రి పొంగులేటి.. ‘నా పేరెందుకు.. నేను చంపమని చెబుతానా?’ అని ప్రశ్నించారు.
అంతేకాదు.. ‘నేను నీకు ఓటేసిన, నేను మందు తాగి అయిన చచ్చిపోత’ అని మృతుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
అక్కడే ఉన్న పోలీసులతో.. ‘సీఐ గారూ… ఏంటో చూడండి’ అని మంత్రి సూచించారు.
అయితే, మంత్రి పోలీసులకు చెప్పగానే.. ‘సీఐ గూడా న్యాయం చేయలా..’ అంటూ పదే పదే ఆరోపించారు.
ఈ పరిణామంతో ఆ పక్కనే ఉన్న సీఐ కూడా ఇబ్బంది పడ్డారు.
రేపు ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లండి.. అని మంత్రి చెప్పడంతో.. ‘సార్.. ఇన్నాళ్లు వాళ్ల కాళ్ల చుట్టూ తిరిగినం… మాకు న్యాయం చేయలా… వాళ్ల కాళ్ల చుట్టూ తిరిగినం సార్. నాకు విసుగు పుట్టింది’ అంటూ పదే పదే ప్రస్తావించారు.
అయినా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండానే మంత్రి ముందుకు వెళ్లిపోయారు. సీఐ, అక్కడున్న భద్రతా సిబ్బంది కూడా మంత్రి వాహనంతో పాటే ముందుకు వెళ్లిపోయారు.
‘మాకు న్యాయమే చేయలేదయ్యా’ అంటూ మృతుడి తల్లి పడుతున్న ఆవేదన అరణ్యరోదనగానే మిగిలిపోతుందా? లేదంటే.. మరుసటిరోజు బాధితులను పోలీసులకు వెళ్లమన్న మంత్రి మాటలు గౌరవించి.. బాధితులకు పోలీసులు న్యాయం చేస్తారా? కాదంటే.. ఎప్పటిలాగే వాళ్లను స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటారా? అన్న చర్చ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతోంది.
మంత్రికి, బాధితులకు మధ్య జరిగిన ఈ సంభాషణ, అక్కడున్న దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.