ఉత్తర ప్రదేశ్‌లో భారీ అగ్నప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల ట్రక్కులో ఉన్నట్టుండి పేలుడు చోటుచేసుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘజియాబాద్ సమీపంలోని టీలా మోడ్ పోలీస్ స్టేషన్ ప్రాంతం.. భోపురాచౌక్ వద్ద గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కులో పేలుడు సంభవించింది. శనివారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటిగా వరుసగా పేలడంతో భీతావహంగా మారింది. ఈ పరిణామంతో ఆ ప్రాంతమంతా కొద్దిసేపు పేలుళ్లతో దద్దరిల్లింది.
ఈ పేలుళ్ల కారణంగా అక్కడే ఉన్న ఓ చెక్క గోడౌన్‌తో పాటు.. పరిసర ప్రాంతంలో ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. పార్క్‌చేసి ఉన్న పలు వాహనాలు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకోగానే.. అగ్నిమాపకశాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే, పేలుళ్ల కారణంగా ఫైరింజన్లు గానీ, రెస్క్యూ సిబ్బంది గానీ సంఘటనాస్థలం సమీపంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మంటల ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఇళ్లు, గోడౌన్లు మంటల్లో చిక్కుకోవడంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మొదటగా ఆ ప్రాంతంలో ఇళ్లలో ఉన్నవాళ్లను ఖాళీ చేయించారు. ప్రాణనష్టం జరగకుండా, వీలైనంత వరకు ఆస్తినష్టం ఎక్కువగా జరగకుండా.. ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఫలితంగా ప్రాణనష్టం తప్పింది. సంఘటన స్థలం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కూడా పెద్దగా పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల తీవ్రతకు సంబంధించిన దృశ్యాలు మూడు కిలోమీటర్ల మేర కనిపిస్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలిసిరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.