ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. మహాకుంభమేళాకు వెళ్లిన నలుగురు తెలుగు మహిళలు అదృశ్యమయ్యారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పలువురు ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు వెళ్లారు. అయితే, జగిత్యాల నుంచి వెళ్లిన వారిలో నలుగురు మహిళలు తప్పిపోయారు. వాళ్ల ఆచూకీ తెలియడం లేదని బంధువులు చెబుతున్నారు. తప్పిపోయిన నలుగురు మహిళలూ 55 సంవత్సరాల పైబడిన వాల్లే అని అంటున్నారు. అంతేకాదు.. తప్పిపోయిన వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు.
ప్రయాగ్రాజ్ వెళ్లి తప్పిపోయిన వారిలో విద్యానగర్ కు చెందిన నరసవ్వ (55), కొత్త వాడకు చెందిన రాజవ్వ (55) ఉన్నారు. వీరితో పాటు.. మరో ఇద్దరు కుటుంబ సభ్యులు నిర్మల్ జిల్లా కడెంకు చెందిన బుచ్చవ్వ (65), సత్తవ్వ (55) ఉన్నారు. మహాకుంభమేళా కోసం ప్రయాగ్రాజ్ వెళ్లిన వారిలో మరికొద్ది మంది సైతం తప్పిపోయినట్టు తెలుస్తోంది. వీళ్లందరూ కలిసి ఒకేసారి ప్రయాగ్రాజ్ బయలుదేరి వెళ్లారు. మొత్తం 11 మంది మహిళలు ఈ నెల 29న కుంభమేళాకు చేరుకున్నారని చెబుతున్నారు.