- 88శాతంతో దేశంలో నెంబర్ వన్ స్టేట్ గా తెలంగాణ
- మొత్తం రాష్ట్ర ఆదాయంలో OTR వాటా సగానికన్నా పైనే
- తర్వాత స్థానాలు కర్ణాటక, హర్యానా (86 శాతం)
- టోటల్ ఇరిగేటెడ్ క్రాప్ లో అధిక దిగుబడి రాష్ట్రాల్లో తెలంగాణ
- వియ్ హబ్ తో ఎన్నో సాధించాం
- ప్రభుత్వ చేయూతతో పెరిగిన మహిళా సాధికారత
- ఆర్థిక సర్వే2024 – -2025 వెల్లడి
సొంత పన్ను రాబడి వసూళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని ఆర్థిక సర్వే తెలిపింది. గతేడాది ఏప్రిల్ -నవంబర్ మధ్యకాలంలో 88 శాతం సొంత పన్ను రాబడి వసూళ్లు సాధించిందని తర్వాత స్థానాలలో కర్ణాటక, హర్యానా (86శాతం) రాష్ట్రాలు నిలిచాయని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ఆర్ధిక సర్వే 2024 – -2025 నివేదికను పార్లమెంటు ముందుంచారు. టోటల్ ఇరిగేటెడ్ క్రాప్ లో అత్యధిక దిగుబడిని సాధించిన మూడు రాష్ట్రాల్లో ఒకటిగా కూడా తెలంగాణ నిలిచింది. తొలి రెండు స్థానాలు పంజాబ్ (98శాతం) హర్యానా (94 శాతం) దక్కించుకున్నాయి.
సొంత పన్ను రాబడి (Own tax revenue) అత్యధిక వసూళ్లలో 15 రాష్ట్రాలు మెరుగైన పురోగతిని సాధించగా 88 శాతంతో తెలంగాణ అన్ని రాష్ట్రాలకన్నా ముందుంది. ఇది మొత్తం రాష్ట్ర ఆదాయంలో సగానికి పైగా ఉంది. హైదరాబాద్ లో ఉన్న మహాళా సాధికారత హబ్ (we hub) దీనికి సరైన ఉదాహరణ అని ఆర్థికసర్వే పేర్కొంది. ప్రభుత్వ భాగస్వామ్యం, సహకారంతో మహిళా సాధికారత ఎలా సాధించవచ్చో దీనిని చూస్తే తెలుస్తుందంది. ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ తమ ఉపాధికి, వ్యాపారినికి సరైన నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని, సమాచారం తెలుసుకుని అంచెలంచెలుగా ఎదిగి గ్లోబల్ మార్కెట్ లో తమ ఉత్పత్తులతో సగర్వంగా నిలబడగలుగుతున్నారని ఆర్థిక సర్వే వ్యాఖ్యానించింది. వియ్ హబ్ సంస్థకు రూ.177 కోట్ల నిధులు సమకూరాయని, 6,376 అంకుర సంస్థలు, ఎస్ ఎంఈలు వెలిశాయని7,828మంది ఎంటర్ ప్రెన్యుయర్ల రకరకాల రంగాల్లో రాణిస్తున్నారని ఆర్థిక సర్వే తెలిపింది. హైదరాబాద్ నగరానికున్న ప్రాధాన్యత కూడా ఇది సాధించడానికి దోహదపడిందంది. ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్ 2024-2025 ఆర్థిక సర్వే అంచనాలను ఇవాళ పార్లమెంటు ముందుంచారు. రేపు ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశ పెడతారు.