తెలంగాణ రాష్ట్ర బిజెపి కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ అధ్యక్ష ఎన్నికకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రెండు వారాల క్రితమే ఏ క్షణమైనా కొత్త అధ్యక్షుడు ప్రకటన ఉంటుందని ప్రచారం జోరుగా సాగింది. స్వయంగా బిజెపి ప్రస్తుత అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పది రోజుల్లో కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని వెల్లడించారు. కిషన్ రెడ్డి ఈ మాట చెప్పి కూడా రెండు వారాలు గడచిపోయింది. అయితే కొత్త అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి స్థానికంగా ఉన్న సమస్యలే కారణమని కొందరు అంటున్నారు. క్షేత్ర స్ధాయి నుంచి ఇంకా పార్టీ సంస్ధగత ఎన్నికలు పూర్తి కాలేదని, ప్రధానంగా తెలంగాణ బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉందని పార్టీ వర్గాలు అంటున్నారు. చాలా జిల్లాలకు ఇప్పటి వరకూ నామినేషన్ల స్వీకరణ పర్వమే ప్రారంభం కాకపోవడమే జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తి కాకపోవడానికి కారణమని తెలుస్తోంది. ఇదే సమయంలో అనేక జిల్లాల్లో అధ్యక్షడి ఎంపిక విషయంలో పార్టీ సీనియర్లలో ఏకాభిప్రాయం రాకపోవడం కూడా మరో కారణమంటున్నారు.
చాలా జిల్లాల్లో తమ నేతలకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ రాష్ట్ర ముఖ్య నేతల పైరవీలు ప్రారంభించి తీవ్ర స్ధాయిలో జిల్లా నేతల మీద ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే జిల్లా అధ్యక్షులను ఖరారు చెయ్యడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఎట్టిపరిస్ధిత్ఉల్లో ఏకాభిప్రాయంతోనే జిల్లాల అధ్యక్షులను ఎంపిక చేయాలని పార్టీ అధిష్టానం కృతనిశ్చయంతో ఉంది. ఈ జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయితేనే రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికే అనేక మంది పేర్లు తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా తెరమీదకు వచ్చాయి. వీరిలో ప్రధానంగా ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఇటీవల ఆయన ఓ భూ వివాదంలో తలదూర్చి కేసుల పాలు కూడా అయ్యారు. అయితే ఆభూవివాదం వ్యవహారంలో ఈటల న్యాయం వైపే నిలబడ్డారాని వందలాది నిరుపేదలకు అండగా ఉన్నారని ఆయన అనుచరులు అంటున్నారు. ఈ దశలో డీకేఆరుణ పేరు కూడా తెరపైకి వచ్చింది.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఈ అంశాలపై పార్టీ జాతీయ నాయకత్వంతో చర్చించాలని సీనియర్ భావిస్తున్నారు. రేసులో చాలామంది పేర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరార్ అయిందన్న ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది.. అయితే మరి కొంతమంది నేతలు కూడా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు.. మొత్తానికి ఇప్పట్లో కొత్త అధ్యక్ష ప్రకటన వెంటనే ఉండే అవకాశం లేదని తెలుస్తుంది