- యూసీసీ అమలు చేసిన తొలి రాష్ట్రం గోవా
- సహజీవనం జంటలకు చట్ట బద్ధత
- వారి పిల్లలకు సమాన ఆస్తి, వారసత్వ హక్కులు
- కనీస వివాహ వయసు 21 ఏళ్లు
- షెడ్యూల్డు తెగలకు మాత్రం మినహాయింపు
- త్రిపుల్ తలాక్ నిషిద్ధం
ఉత్తరాఖండ్ ప్రభుత్వం యూనీఫామ్ సివిల్ కోడ్ను ఇవాల్టి నుంచి అమల్లోకి తెస్తోంది. వివాహం, విడాకులు, ఆస్తుల హక్కులు, వారసత్వ హక్కులు, దత్తతకు సంబంధించి పౌరులందరికీ ఒకే విధమైన చట్టాలు అమలయ్యేందుకు ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తెస్తున్నారు. దేశంలో యూనీఫామ్ సివిల్ కోడ్ ను అమల్లోకి తెచ్చిన తొలి కేంద్ర పాలిత ప్రాంతం గోవా కాగా, ఇప్పుడు ఉత్తరాఖండ్ తొలి రాష్ట్రం అవుతుంది. 2022లో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఉమ్మడి పౌరస్మృతి అమలు హామీని బీజేపి గెలిచిన ఏడాది తర్వాత అమల్లోకి తెస్తోంది. ఈ కోడ్ ప్రకారం అన్ని సహజీవనం (లివిన్ రిలేషన్ షిప్స్) జంటలు తమ తమ బంధానికి చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ కలిగి ఉండటమే కాక 21 ఏళ్ల వయసున్న వారయితే ఆ బంధానికి తల్లి దండ్రుల అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకుని ఉండాలి. ఈ రూల్ రాష్ట్రం బయట ఉంటున్న ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవారికి కూడా వర్తిస్తుంది.
లివిన్ రిలేషన్స్ కు చట్టబద్ధత
సహజీవనం చేసే జంటలు తమ బంధాన్ని డిక్లేర్ చేయకపోయినా, లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా వారికి మూడు నెలల జైలు లేదా రూ.25 వేలరూపాయల జరిమానా లేక రెండూ విధిస్తారు. ఈజంటలు నెల్లాళ్ల లోగా తమ బంధానికి చట్ట బద్ధమైన గుర్తింపు తీసుకోకపోయినా మూడు నెలల జైలు, కనీసం పదివేల రూపాయల జరిమానా భరించాల్సి ఉంటుంది.
కనీస వివాహ వయసు 21
అన్ని వివాహాలకు రిజిస్ట్రేషన్ తప్పని సరి చేశారు. ఏ మతానికి చెందిన స్త్రీ, పురుషులైనా కనీస వివాహ వయసును 21 సంవత్సరాలుగా నిర్ధారించారు. ఈ నియమం వల్ల యువతీ యువకులు వారి పెళ్లికి కనీసం డిగ్రీ విద్యార్హత పొందుతారు. ఉమ్మడి పౌరస్మృతి చట్టం ప్రకారం బహు భార్యత్వం, బాల్యవివాహాలు, త్రిపుల్ తలాక్ ఆచారాలు నిషిద్ధం. విడాకులకు కూడా అన్ని మతాలకు ఒకే విధమైన విధానం ఉంటుంది. అయితే ఈ నిబంధన షెడ్యూల్డు తెగలకు వర్తించదు.
సమాన వారసత్వ హక్కులు
ఈ కొత్త చట్టం ప్రకారం అన్నికమ్యూనిటీలకూ వారసత్వ హక్కులు ఒకేలా ఉంటాయి. సహజీవనం వల్ల కలిగే పిల్లలకు కూడా చట్టబద్ధత ఈ కొత్త చట్టం కల్పిస్తుంది. అలాగే వారికీ ఆస్తిలో సమాన హక్కు వస్తుంది. ఆడ, మగ అన్న లింగ బేధం కూడా లేకుండా కొత్త చట్టంలో వారిని పిల్లలు అనే సంభోదిస్తారు. యూనీఫామ్ సివిల్ కోడ్ వల్ల ముస్లింలలో కొన్ని తెగలలో విడాకుల వ్యవస్థలో ఉన్న అంతరాలు, దురాచారాలు తొలగిపోతాయి. నిఖా హలాల్, ఇద్దత్ , త్రిపుల్ తలాక్ లాంటి అనాచారాలకు తావుండదనే అభిప్రాయం మహిళా సమాజం నుంచి వ్యక్తమవుతోంది