ప్రముఖ పాత్రికేయులు, సంగీత విధ్వాంసులు, హాసం హాస్య పత్రిక సంపాదకులు స్వర్గీయ రాజా రాసిన ఆపాతమధురం-2 పుస్తకాన్ని ప్రముఖ ఆర్ధోపెడిక్ వైద్యులు డాక్టర్ గురవారెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని సంగీతీ, సాహిత్య విశ్లేషకులు జె.మధుసూదన శర్మకు అందజేశారు. దివంగత రాజా కుమార్తెలు శ్రేష్ఠ, కీర్తన ప్రచురించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం సికింద్రాబాద్ లోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లోని భవనం శ్రీనివాసరెడ్డి ఆడిటోరియంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ రాజా ఆధ్వర్యంలో వచ్చిన హాసం పత్రిక అంటే నాకెంతో ఇష్టమని అలానే ఆయన నిర్వహించిన వెబ్ సైట్ అంటే కూడా నాకెంతో మక్కువని తెలిపారు. వాటిని పునరుద్ధరించాల్సిందిగా రాజా కుమార్తెలను కోరారు. నాకు తెలిసి రాజా… తెలుగువారికి బినాకా గీత్ మాల అమీన్ సయానీ లాంటి వారు. ఆయన రాసిన ఆపాత మధురం తొలి భాగాన్ని నేను, పామర్రులోని నా స్నేహితురాలు డాక్టర్ భార్గవితో కలిసి ప్రచురించాను. ఇలా పుస్తకాలను ప్రచురించాలనే కోరిక నాకు మా బావ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి నుండి అబ్బింది. రాజా గారు మరికొంతకాలం మనతో ఉండి ఉంటే 1971 వరకూ వచ్చిన పాటలను కూడా విశ్లేషించి ఉండేవారని గురవారెడ్డి అన్నారు. కనీసం ఆ పనిని మధుసూదనశర్మ చేస్తే, దానిని పుస్తకంగా తీసుకొచ్చే బాధ్యతను నేను స్వీకరిస్తానని డాక్టర్ గురవారెడ్డి ప్రకటించారు. తెలుగు విశ్వవిద్యాలయం అధ్యపకురాలు సి. మృణాళిని మాట్లాడుతూ రాజా పాటను సంగీతపరంగా, సాహిత్యపరంగా లోతైన విశ్లేషణ చేసేవారన్నారు. సంగీత దర్శకుల బాణీని, గీత రచయితల పదాలను జాగ్రత్తగా గమనించి, వాటిని గురించి వివరించేవారని చెప్పారు. ఈ పుస్తకంలో ప్రతి పాటతో పాటు క్యూ ఆర్ కోడ్ పెట్టడం అనేది మంచి ప్రయత్నమన్నారు. పాట గురించి చదవడంతో పాటు దానిని వినే ఆస్కారం కలిగించడం బాగుందని మృణాళిని అన్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ మాట్లాడుతూ పాట ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? అనే వివరాలను పాట అనే కార్యక్రమం ద్వారా అందించాలని అనుకున్నాను. అందుకు నాకు సంపూర్ణ సహకారం అందిస్తానని రాజా మాట ఇచ్చారు. కానీ దానిని నెరవేర్చకుండానే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయారు అంటూ బాధను వ్యక్తం చేశారు. మధుసూదన శర్మ అయినా భవిష్యత్ తరాలకు తన దగ్గర ఉన్న సమాచారాన్ని అందించాలని ఆర్.పి. పట్నాయక్ కోరారు.
మ్యూజికాలజిస్ట్ రాజాతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, ఈ పుస్తక ప్రచురణ కర్త డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఆహుతులతో పంచుకున్నారు. రాజాకు సంగీతం పట్ల ఉన్న పట్టు తెలిసిన వ్యక్తిగా ఆయన సంపాదకత్వంలో హాసం పత్రికను ప్రారంభించానని, అయితే అనివార్య కారణంగా దానిని ఆపివేయాల్సి వచ్చిందని, చాలా మంది ఇప్పటికీ హాసం పత్రిక ఆగిపోవడానికి కారణాలు అడుగుతుంటారని, రాజీ పడలేని రాజా మనస్తత్త్వం కారణంగానే ఆ పత్రికను తాను ఆపేశానని, రాజా లేని హాసం పత్రికను తీసుకురావడం తనకు ఇష్టం లేకపోయిందని వర ప్రసాదరెడ్డి వివరించారు. ఇప్పటికీ హాసం ప్రచురణలు పేరుతో పుస్తకాలను ప్రచురిస్తున్నామని అన్నారు. రాజా రాసిన ఆపాతమధురం -2 పుస్తకాన్ని తీసుకురావడం కోసం అమెరికాలో ఉండే ఆయన కుమార్తెలు శ్రేష్ఠ, కీర్తన ఎంతో శ్రమించారని అంటూ వారిద్దరినీ వరప్రసాద్ రెడ్డి అభినందించారు.
రాజాగారి తరహాలోనే ఆయన కుమార్తెలు తన మీద అభిమానంతో ఈ పుస్తకాన్ని తనకు అంకితం ఇవ్వడం పట్ల మధుసూదన శర్మ ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ హాసం రాజాతో తనకున్న అనుబంధాన్ని తెలియచేశారు. ఈ పుస్తకం తీసుకు రావడానికి తమకు సహకరించిన వారికి రాజా పెద్ద కుమార్తె శ్రేష్ట ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మ్యూజికాలజిస్ట్ రాజా వెబ్ సైట్ ను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.