తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పోరాటాన్ని చరిత్ర ఎప్పటికీ మరువదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్‌అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన కార్యక్రమంలో సియం మాట్లాడుతూ రాష్ట్ర సాధన ప్రక్రియలో ప్రత్యేక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులను మా పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ గుర్తిస్తూనే ఉంటుందన్నారు. సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని అందుకే సింగరేణి లాభాలలో కార్మికులకు వాటాలు పంచాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీయం రేవంత్‌రెడ్డి తెలిపారు. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా భవిష్యత్తులో సింగరేణి సంస్ధని తీర్చిదిద్దుతామని రేవంత్‌రెడ్డి చెప్పారు. సింగరేణి మొత్తం ఆదాయం రూ.6394 కోట్లు కాగా అందులో రూ.4034 కోట్లు భవిష్యత్ పెట్టుబడులకు కేటాయించామని నికర లాభాంలో 34 శాతం రూ.819 కోట్లు పర్మినెంట్ కార్మికులకు బోనస్ కోసం కేటాయించామని సీయం రేవంత్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది కాంట్రాక్టు కార్మికులకు గత ఏడాది రూ.5000 బోనస్ అందించామని ఈ సారి వారికి రూ.5500 బోనస్ అందిస్తున్నామన్నారు. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారని, ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్ లో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సింగరేణి కార్మికులకు హామీ ఇచ్చారు. కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గిందని తక్షణమే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.