ఉత్తరాంధ్ర రాజకీయ దురంధరుడు బొత్స సత్యనారాయణ తన రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించి శాసనమండలిలో అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తనదైన శైలిలో అధికార పక్షాన్ని అడుగడుగునా ఇరుకున పెడుతున్నారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించినా శాసనమండలికి మాత్రం వైఎస్సార్సీపీ సభ్యులు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. మండలిలో సంఖ్యా బలం కూడా వైసీపీకి ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ సభ్యులు ప్రజా సమస్యలపై కూడా తమ గళాన్ని బిగ్గరగా వినిపిస్తున్నారు. ఇక బొత్స విషయానికి వస్తే పార్టీ ఆయనకు మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగించడంతో వైసీపీ వ్యూహాలను తన అనుభవంతో పక్కాగా సభలో అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీల్లో ప్రభుత్వం ఏర్పాటు చేశాక అమలు చేస్తున్నవి ఎన్ని ఎగనామం పెట్టినవి ఎన్ని అన్న అంశాలపై మండలిలో చర్చ జరిగేట్లు బొత్స చేయగలుగుతున్నారు.
బొత్స సత్యనారాయణ తన సీనియార్టీని ఉపయోగించుకుని మండలిలో చర్చ సందర్భంగా ఎటువంటి వివాదాలు తలెత్తకుండా విషయం పక్కదారి పట్టకుండా మంత్రులను ఇరుకునపడేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షాన్ని డిఫెన్స్ లో పడేయడంలో బొత్స వ్యవహరించి తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శాంతిభద్రతలపై మండలిలో జరిగిన చర్చ సందర్భంగా హోంమంత్రి అనితను బొత్స తన ప్రశ్నలతో మాటలేకుండా చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని మీ ఉపముఖ్యమంత్రే చెప్పారు కదా అని బొత్స లేవనెత్తడంతో దానికి సమాధానం ఇవ్వలేని పరిస్ధితిని హోంత్రి ఎదుర్కొన్నారు. ఇక ఏడాదికి మూడు ఉచిత సిలెండర్ల హామీ వ్యవహారంలో కూడా బొత్స లేవనెత్తిన అంశాలపై సమాధానాలు ఇవ్వలేక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తోపాటు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చివరికి బొత్స వేసిన ఉచ్చులో ఇరుక్కున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సంవత్సరం మూడు సిలెండర్లు ఉచితంగా కుదరదని సభాముఖంగా చెప్పేశారు. 2025 వరకూ ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ప్రభుత్వం ఇవ్వనుందని, మూడు సిలెండర్లు ఇవ్వడం సాధ్యం కాదని శాసనమండలిలో మనోహర్ తో చెప్పించారు బొత్స. ఈవిధంగా బొత్స నాయకత్వంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు అనేక అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతుండటంతో అధికార పక్షం సభ్యులు ఇరకాటంలో పడుతున్నారు.
బొత్స సత్యనారాయణ కేవలం మండలిలో వ్యూహాలకే పరిమితం కావటం లేదు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదాలో అమరావతి నుంచి ఢిల్లీ వరకు పలు ప్రజా సమస్యల పై లేఖాస్త్రాలు సంధింస్తున్నారు. అమిత్ షాకు లేఖ రాయడం ద్వారా ఎన్నికలకు ముందు కలకలం రేపిన విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసును తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీని పై విచారణ చేయాలని కేంద్ర హోంమత్రికి లేఖ రాశారు. అలాగే చంద్రబాబుకు కూడా లిక్కర్ మాఫియా, రేషన్ మాఫియా, డయేరియా కేసుల పెరుగుదల తదితర అంశలపై వరుస లేఖలు సంధిస్తూ వాటిని తక్షణం పరిష్కరించమని ఆలేఖల్లో డిమాండ్ చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐదు లేఖలు రాశారు బొత్స. ఈ లేఖల ద్వా ప్రజా సమస్యలను బలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినట్లు అవుతుంది, పరిష్కరించకపోతే ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించటానికి ఆస్కారం ఏర్పడుతుందనేది బొత్స వ్యూహం. గత మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనా… ఎమ్మల్సీగా మండలిలో ప్రతిపక్ష నేతగా తనకు అందివచ్చిన అవకాశాన్ని నూటికి నూరు శాతం వినియోగించుకుని తన రాజకీయ చతురతను కనబరుస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.