ఈనెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ , తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమానికి 12 దేశాల నుంచి ప్రతినిధులు, 100 మంది వక్తలు, 350 రకాల ప్రదర్శనలు, 1500 మంది కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. లోక్ మంథన్ కార్యక్రమం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని కిషన్ రెడ్డి వివరించారు. ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 21 నుంచి నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
భారతీయ సంస్కృతి ఏకత్వాన్ని చాటే కార్యక్రమం లోక్‌మంథన్ అని కిషన్‌రెడ్డి అన్నారు. ఇతర దేశాల నుండి కూడా ప్రతినిధులు పాల్గొన బోతున్నట్లు వెల్లడించారు. వందలాది కళాకారులు, విద్యా వేత్తలు, మేధావులు పాల్గొంటారని చెప్పారు. సముద్ర మథనం ఎలా జరిగిందో అలా ఈ లోక్ మంథన్ జరుగుతుందని తెలిపారు. వనవాసి, నగర వాసి, గ్రామ వాసి ఈ మూడు కలిస్తే నే దేశం అన్నారు. దురదృష్టవశాత్తూ ప్రజలను కులాల వారీగా విభజించే కుట్ర జరుగుతుందన్నారు. బిర్సా ముండా జయంతిని, గిరిజన గౌరవ దినంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని గుర్తు చేశారు. 21వ తేదీన స్టాల్స్ ఎగ్జిబిషన్‌ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. 22వ తేదీన లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. లోక్‌మంథన్ కార్యక్రమానికి ఎంట్రీఫీజు ఉండదని, అన్ని వర్గాల వాళ్లు ఈ కార్యక్రమానికి రావాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.