తెలంగాణలో కాంగ్రెసు ప్రభుత్వం నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ నాయకులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా
రాయికల్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో సమగ్ర ఇంటి కుటుంబ సర్వేలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని ఎన్యుమరేటర్లను వివరాలు ఆడిగి తేలుసుకున్నారు. ఎన్యుమరేటర్లు నింపుతున్న దరఖాస్తులను జీవన్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు వారి వివరాలు క్లుప్తంగా చెప్పాలని ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. గడిచిన సంవత్సర కాలంలో ఉచిత బస్ ప్రయాణంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు.
కొంత మందికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదన్నారు. తొందరలోనే 2 లక్షల పైన ఉన్న రైతులందరికి రుణమాఫీ అవుతుందని జీవన్ రెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని అందరికీ తెలిసిందే అయిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, ఇంకా 10 వేల కోట్లు వెచ్చించి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.
నిధుల కొరతతో కొన్ని పథకాల అమలులో జాప్యం జరుగుతుందని వాటిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుందని జీవన్ రెడ్డి తెలిపారు.