మరో 100 ఏళ్ళు మనగలిగే విధంగా వేములవాడ దేవాలయాన్ని తీర్చిదిద్దుతామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. వేములవాడ దేవాలయం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి కార్యకలాపాలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అత్యున్నత సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమీషనర్ హనుమంతు, వేములవాడ ఈవో వినోద్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయానికి వచ్చే వాారి కోసం టూ వీలర్, ఫోర్ వీలర్, బస్ పార్కింగ్ లకు వేర్వేరు స్థలాలను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు.
దేవాలయ ప్రాశస్త్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని, వేదపాఠశాలను శాస్త్ర ప్రకారం తీర్చిదిద్దాలన్నారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వ నిధులతో పాటు, సిఎస్ఆర్, దాతల విరాళాలు సేకరించాలని కోరారు. బిల్వ వనాన్ని ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.