రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటామని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు ఏళ్లు పాలించి మెస్ ఛార్జీలు పెంచలేదన్న డిప్యూటీ సీఎం.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40శాతం మెస్ చార్జీలు పెంచామన్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి ఐదువేల కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు. పాఠశాలలు ప్రారంభం కాగానే పుస్తకాలు, యూనిఫామ్స్ సరఫరా చేశామన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాత నెహ్రూజీ అని.. ఆయన నిర్ణయాలతోనే నేడు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని స్పష్టం చేశారు. గుండు సూది కూడా ఉత్పత్తి చేయలేని దేశంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి.. రాకెట్లు తయారు చేసే స్థాయికి ఈ దేశాన్ని నెహ్రూ తీసుకువెళ్లారని కొనియాడారు. ప్రజలు జీవించడమే కాదు గౌరవప్రదమైన హక్కులు వారికి ఉండాలని మన తొలి ప్రధాని నెహ్రూ ఆలోచనలు చేశారన్నారు భట్టి విక్రమార్క.శాస్త్రీయ విద్య, ఉపాధి కల్పనకు ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థలను స్థాపించుకున్నామని గుర్తు చేశారు. ఆధునిక దేవాలయాలు పిలుచుకునే బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఆయన ఆలోచనలే అని భట్టి విక్రమార్క అన్నారు. కృష్ణానదిపై నాగార్జునసాగర్, గోదావరి నదిపై ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిర్మించి ఈ రాష్ట్రం మీదుగా రెండు జీవనదులు పారించేందుకు చాచా నెహ్రూ పునాదులు వేశారన్నారు. భిన్నత్వంలో ఏకత్వంతో ఈ దేశాన్ని నడిపారని, అమెరికా కూటమి ఇటు రష్యా కూటమికి దూరంగా అలీన విధానంతో సమదూరం పాటించి స్వతంత్రంగా వ్యవహరించి ప్రపంచదృష్టిని మన తొలి ప్రధాని ఆకర్షించారని ఉప ముఖ్యమంత్రి విద్యార్థులకు గుర్తు చేశారు.