‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగా పడ్డారని, రైతులు దారుణంగా మోసపోయారని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఘాటుగా విమర్శించారు. ఏం సాధించారని సంబురాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి..? ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు ఏడాది అయినా అతీగతీ లేదని ప్రశ్నించారు.
డిక్లరేషన్ లో చెప్పిన మొట్ట మొదటి హామీ 2లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదని, రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసాకు దిక్కులేదని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తాన్న 12వేలు ఇవ్వనేలేదని, పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేసారని మండిపడ్డారు.
పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేండ్ల వెనక్కి వెళ్లిందని, కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసే దుస్థితి నెలకొందన్నారు. బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ సక్సెస్ ఫుల్ గా రోడ్ల మీదకు తెచ్చినవని విమర్శించారు.
కేసీఆర్ పదేళ్ల కాలంలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే, పది నెలల పాలనలో నువ్వు అందరి కడుపు కొట్టినవు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచినవన్నారు. మీరు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు రేవంత్ రెడ్డి, సక్సెస్ ఫుల్ గా ప్రజల్నిమోసం చేసినందుకు అపజయోత్సవాలు జరుపుకోవాలన్నారు. ఏడాది కావొస్తున్నది. ఇప్పటికైనా కళ్లు తెరవండి. అద్భాతాలు చేసామనే భ్రమ నుంచి బయటపడి ఇచ్చిన హామీలు అమలు చేయండని డిమాండ్ చేశారు.
ప్రజలను మోసం చేసినందుకు వరంగల్ వేదికగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీగా మహిళలకు చెప్పిన రూ. 2500 ఎప్పటి నుంచి ఇస్తారో, కల్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారో, స్వయం సహాయక సంఘాలకు షరతులు లేకుండా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని, తేదీలు ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.