దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం లోక్ మంథన్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో శుక్రవారం లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు చాలా ఘనమైనవని చెప్పారు. మన బలమే భిన్నత్వంలో ఏకత్వమని… ఇలా భిన్న సంస్కృతులు ఒకే చోట ఉండటం గొప్ప విషయమని కొనియాడారు. లోక్ మంథన్ కార్యక్రమంలో అహల్యాబాయ్ హోల్కర్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరవనితల గాధలను ప్రదర్శించడం పట్ల ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇండోనేషియాతో సహా వివిధ దేశాల ప్రతినిధులు ఈ వేదిక ద్వారా తమ సంస్కృతులను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. విదేశీ శక్తులు శతాబ్దాలుగా మన మీద జులూం ప్రదర్శించాయని మన సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విధ్వంసం చేశాయని కానీ మనం వాటిని పాటించి సజీవంగా ఉంచుకోగలిగామని పేర్కొన్నారు. ఐకమత్యం, సమరసతే మన సభ్యత, మన భవిష్యత్తు అని ఆ దిశగా మనమంతా కలిసి పనిచేద్దామని రాష్ట్రపతి లోక్ మంథన్ వేదిక నుంచి పిలుపునిచ్చారు.