ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషమన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. మరి.. ఇదే క్రమంలో సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ చేయించరా? అని ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్‌పై ఎందుకు పెట్టలేక పోతున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు కూడా విలువ లేదా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు షర్ఇమల. అంతేకాదు.. మీరు కూడా అదానీకి అమ్ముడుపోయారా? అని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా? అని షర్మిల నిలదీశారు. నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారో చెప్పాలన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా.. సెకీతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి ఉందని ఆరోపణలు చేసి.. ఇప్పుడెందుకు మిన్నకుండిపోతున్నారని షర్మిల సందేహం వ్యక్తం చేశారు. డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో అప్పుడు కేసు కూడా వేయించారని, తాము అధికారంలో వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తాం అని.. గొప్ప గొప్ప మాటలు చెప్పారని.. ఆమాటలు మర్చిపోయారా? ఇప్పుడేమైంది చంద్రబాబు గారు? అని షర్మిల ప్రశ్నించారు.అదానీకి ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కూడా అమ్ముడుపోయారా? అని అనుమానం వ్యక్తం చేశారు.
- Advertisement with us -