తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్ధల్లో వరుసగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట పరిధిలోని మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండోసారి కలుషితాహారం తిని 40 మంది విద్యార్థినులు అస్వస్ధతకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేసిన తరువాత 40 మంది విద్యార్థినులు అస్వస్ధతకు లోనయ్యారు. వెంటనే వీరిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇదే పాఠశాలలో ఈ నెల 20వ తేదీన ఫుడ్ పాయిజనింగ్ అవ్వడంతో అప్పుడు వంద మంది విద్యార్ధులు ఆసుపత్రి పాలయ్యారు. ఆ సంఘటన జరిగి వారం రోజులు కూడా కాకుండానే మరో సారి ఆహారంలో కలుషితం జరిగింది.