మాహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యింది. రెండో రౌండ్ ఫలితాలు వెలువడే నాటికి అధికార మహాయతి కూటమే ముందంజలో ఉంది. దాదాపు 188 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఆధిక్యంలో కొనసాగుతుండగా 86 స్ధానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కొనసాగుతోంది. మహాయుతి నుంచి పోటీలో ఉన్న ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కొప్పి అసెంబ్లీ స్ధానంలో, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ సౌత్ నుంచి, అజిత్ పవార్ బారామతి అసెంబ్లీ స్ధానం నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే బాంద్రా ఈస్ట్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఇటీవల హత్యకు గురైన సిద్ధిఖీ తనయుడు జీషాన్ సిద్ధిఖీ ముందజలో ఉన్నారు. మహాయతి కూటమిలో భాగస్వామి అయిన ఎన్సీపీ(అజిత్) పార్టీ నుంచి జీషాన్ పోటీలో ఉన్నారు. ఔరంగాబాద్ ఈస్ట్ నుంచి ఎమ్ఐఎమ్ అభ్యర్ధి ఇంతియాజ్ జలీల్ ఆధిక్యంలో ఉన్నారు.