రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యతతో కూడిన భోజనం అందడం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం అధ్వాన్నంగా అందిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఉడకని అన్నం వడ్డిస్తున్నారు. నీళ్ల చారు, నాణ్యత లేని పప్పును అందిస్తున్నారని తెలిపారు. వారానికి మూడుసార్లు ఇచ్చే గుడ్డు కూడా మాయమైందని గుర్తు చేశారు.
విద్యార్థులకు గుడ్ల పంపిణీ ఏడాదిగా నిలిచిపోయిందని, బిల్లులు రాక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజన కార్మికులకు 11 నెలలుగా జీతాల్లేవు. ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు అని చెప్పారు. పేద విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టం అవుతోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలాగూ విద్యాశాఖను పట్టించుకోడు కాబట్టి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.