– ఆహ్వాన పత్రికల్లో ఆమె పేరు జోడింపు
– రేపే మహారాష్ట్ర సీఎం ప్రమాణం
మహారాష్ట్రలో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. అనేక తర్జన భర్జనల తర్వాత మహాయుతి కూటమిని విజయపథంలో నడిపిన ఫడ్నవిస్‌కే ముఖ్యమంత్రి పీఠం దక్కింది. రేపే ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం కావడంతో ముంబై ఆజాద్ మైదాన్‌లో ప్రమాణ స్వీకారపు ఏర్పాటు శరవేగంగా సాగుతున్నాయి. ముచ్చటగా మూడోసారి ఫడ్నవిస్ సీఎంగా గురువారం పగ్గాలు చేపడుతున్నారు. ప్రమాణ స్వీకారానికి పిలిచే అతిధుల కోసం ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించారు.అయితే ఈసారి ముద్రించినప్రతికలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
తల్లికి పెద్ద పీట..
దేవేంద్ర ఫడ్నవిస్ ఈసారి తన తల్లికి ప్రయారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆహ్వాన పత్రికలో ముఖ్యమంత్రి పేరును దేవేంద్ర సరితా గంగాధర్ రావు ఫడ్నవిస్‌గా ముద్రించారు. సాధారణంగా మరాఠీయులు తండ్రి పేరును మిడిల్ నేమ్‌గా రాసుకుంటారు. అయితే ఫడ్నవిస్ తల్లి సరిత పేరును రాసుకుని ఆ తర్వాత తండ్రి పేరును జోడించుకున్నారు. వాస్తవానికి ఈ సారి ఫడ్నవిస్ తన ఎన్నికల అఫిడవిట్‌లోనే ఈ మార్పు చేశారు.2014, 2019 ఎన్నికల్లో ఇలాంటి మార్పులు కనిపించలేదు. ఈసారి మాత్రమే ఇలా కొత్త పంథాకు తెర తీశారు.
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఫడ్నవిస్ తన తండ్రిని యుక్తవయసులో ఉండగానే కోల్పోయారు. గంగాధర్ ఫడ్నవిస్ ఎమ్మెల్సీగా సేవలందించారు. మొదట జనసంఘ్‌లో ఆ తర్వాత బీజేపీలోనూ ఆయన కొనసాగారు. ఫడ్నవిసే రాష్ట్ర కొత్త సీఎం అని ఆయన తల్లి సరిత చెబుతూ వస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే అందరూ ఫడ్నవిస్ సీఎం కావాలని కోరుకున్నారని, మోడీకి అత్యంత ఆప్తుడనీ ఆయన్ను మోడీ సొంత కొడుకులా చూస్తారని సరితా ఫడ్నవిస్ తెలిపారు.ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆమె సోషల్ యాక్టివిస్టు కూడా. వారికి దివిజ అనే కుమార్తె ఉంది.