చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ వంటి కార్యక్రమాలు నేటి సమాజంలో ఎంతో అవసరమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శాసన సభలో సభ్యులు లేవనెత్తే ప్రశ్నలు, సమాధానాలు.. ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షాల బాధ్యత అన్నారు. లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపొజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని గుర్తు చేశారు. సభను సమర్ధవంతంగా నడిపే బాధ్యత స్పీకర్‌పై ఉంటుందన్నారు. విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాల్సి ఉంటుందన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చిల్డ్రన్ మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన చిన్నారులను సీఎం అభినందించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆయన వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వచ్చాయన్నారు. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ ఎంతో కృషి చేశారన్నారు.18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది అన్నారు. ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉందన్న రేవంత్.. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.