37.2 C
Hyderabad
Thursday, May 14, 2026

Live Video

spot_img

తల్లిదండ్రుల పైత్యం… భవిష్యత్ తరాలకు శాపం

సోమవారం నుండి శనివారం దాక పనిదినాలు .
ప్రతి రోజు .. బ్రష్ చేసుకోవడం , స్నానం చెయ్యడం .. వండుకొని తినడం , కనీసం అయిదారు సార్లు మంచి నీరు తాగడం , టాయిలెట్ కు పోవడం ..
వీటన్నింటికీ కనీసం మూడు గంటలు పడుతుంది .
అవును కదా ?

ఆది వారం .. ఎలాగూ సెలవు దినం .
వారానికి సరి పడ్డా ఆదివారమే వండుకొని తినేసి , వారం మొత్తానికి నీళ్లు తాగేసి , వారం మొత్తానికి అదే రోజు టాయిలెట్ అవసరాల్ని కానిచ్చేస్తే ?
స్నానం.. బ్రష్ చేసుకోవడం లాంటి అన్ని దైనందిన అవసరాల్ని.. వారాంతపు అవసరాలుగా మార్చేసుకొంటే ?
పని దినాల్లో ఎంత హాయి ?
ఎంత టైం మిగులు ?

ఐడియా ఎలా ఉంది?

“చెత్తగా ఉంది .
ఇది ఎలా సాధ్యం??” అని నా పై కోపపడుతున్నారా ?

ఆగండాగండి .

ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ .
సువిశాల ప్రపంచం లో ఒక్క తెలుగు వాడికే వచ్చిన దిక్కుమాలిన ఐడియా .
అనేక సంవత్సరాలుగా కాపీ రైట్… పేటెంట్ హక్కులు లేకుండా తెలుగు పేరెంట్స్ గుత్తాధిపత్యంగా నడుస్తున్న బాట !

ఆరో తరగతిలో.. ఆరు.. ఏడు తరగతుల పాఠ్య పుస్తకాలు చదివెయ్యాలి .
ఏడో తరగతిలో .. ఎనిమిది.. తొమ్మిది సిలబస్ ..
ఎనిమిదిలో పది.. పదకొండు ..
ఇలా తొమ్మిదో తరగతి కొచ్చేటప్పటికీ ఇంటర్ సిలబస్ అయిపోతుంది .
అటు పై మూడేళ్లు అంటే పది .. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్ .. ఇంటర్ సిలబస్ ను బట్టీ కొట్టి .. కొట్టి .. కొట్టి .. అంటే రోట్లో దంచి దంచి .. నూరి .. నూరి.. గటగటా తాగేస్తే .. అటుపై పరీక్ష హాళ్ళో పేపర్ పై భళ్ళున కక్కి .. మార్కులు .. ర్యాంకులు కొట్టేసి .. ఐఐటీ సీట్ సాదించేసి .. అమెరికా కు బేగెళ్ళి పోయి గ్రీన్ కార్డు సాధించేసి.. జీవిత వైకుంఠపాళి లో పరమపద సోపానం సాధించేయాలి.

ఇది తెలుగు కార్పొరేట్ విద్యా సంస్థల అద్భుత ఆవిష్కరణ .
రెండు దశాబ్దాలుగా తెలుగు తల్లితండ్రులు కంటికి అద్దుకొని సాగిస్తున్నఉత్తమోత్తమ బాట .
దీనికి సంభందించి నాకు కొన్ని డౌట్ అనుమానాలున్నాయి .
ఎవరైనా తీర్చగలరేమో చూడండి ప్లీజ్ .

1. ఆరో క్లాసు పిల్లాడు ఆరో తరగతిలోనే .. ఆరు, ఏడు పాటలు చదవగలిగితే .. వారి పేరెంట్స్.. వారం తిండి .. ఆదివారమే తినేసి .. వారం మొత్తం టాయిలెట్ అవసరాలు … ఆదివారమే కానిచ్చేయడంలో ఉన్న ఇబ్బంది ఏంటబ్బా ?

2 . కార్పొరేట్ వాళ్లకు స్కూల్స్ ఉన్నాయి. ఆరు నుంచే వాళ్ళు ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ మొదలెట్టేస్తున్నారు. తొమ్మిదో క్లాస్సుకల్లా ఇంటర్ సిలబస్ కంప్లీట్ చేసి ఆపై మొత్తం రివిజన్స్ చేసేస్తున్నారు .
గ్రేట్ .
మరి ఇంత ఫాస్ట్ గా దూసుకెళ్లిన కార్పొరేట్ ఐఐటీ ఫౌండేషన్ విద్యార్థులతో మిగతా పాఠశాలల్లో పది దాక చదివిన విద్యార్థులు అటుపై ఇంటర్ కోసం అదే కార్పొరేట్ లో చేరితే .. పోటీ పడే పరిస్థితి ఉండదు .
మరి అలాంటప్పుడు కార్పొరేట్ ఇంటర్ కాలేజీ లు వేరే పాఠశాలల్లో పది దాక చదివిన విద్యార్థులకు ఇంటర్ సీట్స్ ఎందుకు ఇస్తున్నట్టు ?
ఇచ్చితిరి పో .. కొత్తగా ఇంటర్ లో చేరిన విద్యార్థులు అదే చోట ఆరు నుంచి ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ చదివిన వారితో పోటీ పడలేక చతికిల పడాలి గా ?
కానీ దొంగ ర్యాంకులు పోగా మిగతా వచ్చిన ఆ ర్యాంకుల్లో సింహభాగం ఇలా వేరే స్కూల్స్ లో పది దాక చదివిన వారికే నట కదా ?
ఇదిగో మా దగ్గర ఆరు నుంచి రుబ్బుడు కోర్స్ లో చదివిన వారి పాస్ పర్సెంటేజ్ .. ఇంత గొప్పగా ఉంది .
అదే పది దాక వేరే స్కూల్స్ లో చదివిన వారి ఫలితాలు ఇవి… అని కార్పొరేట్ వాండ్లు ఎప్పుడూ ప్రకటించరు ఎందుకో?
అసలే .. ఐఐటీ లో వున్నది గుప్పెడు రాంక్ లు .
పాపం తల్లితండ్రులు.. కార్పొరేట్ లను నమ్మి.. ఆరో తరగతి లోనే తమ పిల్లల్ని అప్పగిస్తే … వారికి పోటీగా వేరే స్కూల్స్ లో పది దాక చదివిన విద్యార్థులను వీరు ఎందుకు చేర్చుకొని.. వీరికి పోటీగా తయారు చేస్తున్నట్టు ?

3 . బ్రిటిషోరి కాలం దాక మన దేశంలో బాల్య వివాహాలుండేవి . బెంటింక్ దొర దాన్ని నిషేధించిన .. నూట యాభై ఏళ్లకు కార్పొరేట్ లు ప్రవేశ పెట్టిన ఐఐటీ ఫౌండేషన్ కోర్స్… 21 శతాబ్దపు బాల్య వివాహం.. అని గిట్టని వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు .
ప్రతి విద్యార్థికి ఒక ఆప్టిట్యూడ్ అనేది ఒకటి ఏడుస్తుంది .
మాథ్స్ బ్రెయినా? లేక సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్ ? అనేది తొమ్మిది .. పది క్లాసు దాక బయటపడదు.
అలాంటప్పుడు అయిదు పాస్ కాంగనే తల్లితండ్రులే.. ” మాథ్స్” అని డిసైడ్ చేసేసి ఐఐటీ ఫౌండేషన్ దారిలో నిలబెట్టేస్తే .. కార్పొరేట్ వాండ్లు వారికి కేవలం మాథ్స్ .. ఫిజిక్స్ చెప్పి మిగతా సబ్జక్ట్స్ ను తూతుమంత్రంగా చెప్పితే… మాథ్స్ దారిలో వెళ్లలేక అటు పై చతికిల బడే లక్షల విద్యార్థుల మాటేంటి ?

4. స్పోర్ట్స్.. గేమ్స్.. ఆడితే నాయకత్వ లక్షణలొస్తాయి .
సోషల్ సైన్స్ చదివితే సామజిక తెలివితేటలొస్తాయి .
తెలుగు హిందీ చదివితే లైఫ్ స్కిల్స్ అలవడతాయి .
ఇవేవీ లేకుండా … తూకం బాగా రావాలని … ఫారం కోళ్లకు దాణా వేసి పెంచినట్టు… మాథ్స్ ఫిజిక్స్ మాత్రమే చెప్పి ఐఐటీ ఎంట్రన్స్ కోసమే వీరిని తయారు చేస్తే ?
అన్నట్టు .. చెన్నై ముంబై ఐఐటీ లలో తెలుగు విద్యార్థులు ప్రత్యేకించి కార్పొరేట్ బ్రాయిలర్ కోళ్లు అంటే చిన్న చూపు.. అంటగా? ఎందుకో .
కార్పొరేట్ బ్రాయిలర్ కోళ్ళలో ఐఐటీ దాక చేరేదే సున్నా పాయింట్ సున్నా ఒక శాతం . చేరిన వాళ్ళు కూడా అక్కడ చతికిల పడుతారంట కదా ? ఎందుకో ?

5. ఐఐటీ అంటేనే ఇన్నోవేషన్ . ఆరు నుంచి బట్టి చదువుల కు అలవాటు పడిన వారు ఇన్నోవేషన్ చేసింది ఏందీ ?
బతుకు సాగేది యెట్లా ?

6. “ఐఐటీ లో చదివిన అమ్మాయి పెళ్లి చేసుకోవడనికి నిరాకరిస్తోంది .. ఉద్యోగమే ముఖ్యం” అంటోంది అని ఒక తండ్రి తనతో వాపోయినట్టు మధుసూదన్ అనే ఒక మిత్రుడు తన వ్యాసం లో రాసారు.
ఇలాంటి అమ్మాయిలు నేడు కోకొల్లలు .
పెళ్లి- కుటుంబము డెమోక్రాటైజ్ కావాలి . లింగ సమానత్వం రావాలి.
నిజమే .
అదే సమయం లో లైఫ్ కోసం ఉదోగ్యమా ? ఉద్యోగం కోసం లైఫ్ ?
ఈ చిన్న కామన్ సెన్స్ లేకుండా పిల్లల్ని పెంచిన పాపం ఎవరిది?
తెలుగు తల్లితండ్రులది కాదా?
ఇంట్లోకి అమ్మమ్మ , మేనత్త వచ్చారు .. “అమ్మా.. ఇది మేము చూసుకొంటాము .. నువెళ్ళి తెలుపేసుకొని. చదువుకో” ..
“అరేయ్ దీపావళి ది ఏముంది ..ప్రతి సంవత్సరం వస్తుంది . టపాకాయలు లేవు .. ఏమీ లేదు.. తలుపేసుకొని చదువుకో”
..” ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ ముఖ్యం .. అంతకు మించి జీవితం లేదు” అని ఆరు నుంచి పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి బ్లాక్ హోల్ లాంటి అపార్ట్మెంట్ గదిలో బందించి చదివిస్తే ..వారికి ఒక వేళా ఐఐటీ సీట్ వచ్చినా మతి ఉంటుందా ?
పెళ్లి .. కుటుంబం .. పిలల్లు .. అమ్మా.. నాన్న .. సంతోషం.. ఆరోగ్యం అన్న .. ఇంగిత జ్ఞానం ఏడుస్తుందా ?
” నేను నా జాబ్.. నా ప్యాకేజీ” అంటూ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థకు ఊడిగం చేస్తూ… అదే జీవితం అనుకొని చివరకు తనను ప్యాకేజీ చేసేదాకా… వాళ్ళు దారి తప్పి నడిస్తే … ఆ పాపం ఎవరిది ?

7. ఒకప్పుడు .. వ్యవసాయం చేసే వారికి .. పౌరోహిత్యం వృత్తిలో ఉండేవారికి అమ్మాయిని ఇవ్వడానికి వెనకాడే వారు . ఇప్పుడు అది… కాస్త ముందుకెళ్లి .. అమెరికా లోనో కెనడా లోనో ఉంటేనే .. ఆ ఉండుడు ఎలా ? అక్కడ పెట్రోల్ పుంపా ? హోటల్ లో టేబుల్ క్లీనింగా? పిల్లల్ని పెంచే మేల్ ఆయమ్మ ఉద్యోగమా? అనే ద్యాస లేకుండా ఫారిన్ సంబంధం అయితేనే ఓకే.. లోకల్ గా… వాడు కలెక్టర్ అయినా … తూచ్ అనేస్తున్న తెలుగు తల్లితండ్రులకు జోహార్లు .

ఒక తరం కార్పొరేట్ విద్యతో వెర్రి గాడిదలయ్యారు .
గాడిద పాలు కు .. గాడిద గుడ్డు కు మస్తు రేట్ వస్తుందని నమ్మే వెర్రి బాగులోళ్ళు !
వీరిని ఇలా పెంచిన పాపం ఎవరిది?
లెక్కకు మిక్కుటంగా తయారయిన ఈ చదువుకొన్న గాడిదలు సమాజాన్ని.. ఏ దిక్కున తీసుకెళుతారో !
దేవుడు కూడా కూడా ఏమీ చెయ్యలేక చేతులెత్తేసే పరిస్థితి .

వాసిరెడ్డి అమర్ నాథ్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com