కూల్ వింటర్ లో సెలబ్రిటీల పెళ్లి వార్తలు వేడెక్కిస్తున్నాయి. ఇప్పటి వరకు సింగల్ స్టేటస్ తో ఉన్న పలువురు సెలబ్స్ ఇక జంటగా ప్రయాణం కట్టడానికి సిద్ధం అవుతున్నారు. మనసు దోచిన వారిని మనువాడి కొత్త ఏడాది కొత్తగా జీవితాలను ప్రారంభించనున్నారు. ఈ డిసెంబర్ నెలలో ముగ్గురు సెలబ్రిటీల ఇళ్లలో పెళ్ళి బాజాలు మోగనున్నాయి. ఈ సందడి ఎలా ఉండనుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ముందుగా అక్కినేని నాగ చైతన్య- శోభిత ధూళిపాళ పెళ్లి సందడి ప్రారంభం అయిపోయింది. మరి కొద్ది గంటల్లోనే ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒకటి కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా బాజా బజంత్రీలు మోగనున్నాయి. గతంలో హీరో నాగ చైతన్య- సమంత పెళ్లి , విడాకుల ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. గ్యాప్ తర్వాత నాగ చైతన్య మోడల్, నటి శోభితతో ప్రేమలో పడ్డారు. పెద్దలు కూడా పచ్చజెండా ఊపటంతో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. కొత్త జంటకు బహుమతిగా ఇవ్వటానికి శోభిత మామ అక్కినేని నాగర్జున రెండు కోట్లు పెట్టి టయోటా లెక్సస్ వాహనాన్ని కొన్నారు అన్న టాక్ ఫిల్మనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇక రేపటి వేడుకకు తెలుగు తెర తారాగణం అంతా కదిలి రానున్నట్లు సమాచారం. చైతన్య-శోభిత వివాహ వేడుక పూర్తిగా హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగనుంది.
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టిన కీర్తి సురేష్ ఈ నెల 12న పెళ్లి కూతురు కానుంది. తన బాల్య స్నేహితుడు, వ్యాపారవేత్త ఆంటోనితో ఏడడుగులు నడవనుంది. 15 ఏళ్ల పాటు ప్రేమను సాగించినా…ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడిన ఈ అందాల రాసి ఈ మధ్య హఠాత్తుగా తన పెళ్లి గురించి ప్రకటించింది. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుంది. అందం, అద్బుత నటనతో వెండి తెర పై తనదైన ముద్ర వేసుకున్న కీర్తి సురేష్ పెళ్లి కబుర్ల కోసం ఆమె అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోతోంది.
ఇక వరల్డ్ క్లాస్ షట్లర్ పీవీ సింధు పెళ్లి వార్త కూడా తాజాగా బయటకు వచ్చింది. సింధు మాత్రం ప్రేమ జోలికి వెళ్లకుండా పెద్దలు కుదిర్చిన సంబంధంతో పెళ్లి బంధంలోకి అడుగు పెడుతోంది. ఈ నెల 22న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఈమె వివాహం దత్తసాయితో జరుగనుంది. 24వ తేదీన హైదరాబాద్ లో రిసెప్షన్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. పొసిడెక్స్ టెక్నాలజీస్ అనే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దత్తసాయి కుటుంబం, సింధు కుటుంబానికి మధ్య చాలా కాలం నుంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు.
మార్గశిర మాసం (డిసెంబర్)లో బలమైన ముహుర్తాలు ఉండటంతో సెలబ్రిటీలు సైతం పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. దీనితో వీరి పెళ్లి వార్తలు, షాపింగ్, హాజరయ్యే అతిధులు, ఇతర విశేషాలతో సోషల్ మీడియా అంతా ఫుల్ బజ్.