ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో, ఆర్ కె ఫిలిమ్స పతాకంపై తమిళంలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” సినిమా ఈనెల 29వ తేదీన గ్రాండ్ గా విడుదలకు సిద్దమైంది. అత్యధిక థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన “ఝాన్సీ ఐపిఎస్” చిత్రాన్ని తెలుగులో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నానన్నారు. లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ సినిమా తమ ఆర్ కె బ్యానర్ కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందన్నారు. లక్మీ రాయ్ చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయని, ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు అద్భుతమైన 8 ఫైట్స్ కంపోజ్ చేశారని చెప్పారు. మాస్ ప్రేక్షకులను ఫైట్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదన్నారు. విద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, యువత భవిష్యత్ ను పెడదారి పట్టించే, డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపిఎస్ ఆఫీసర్ గా, గ్రామాల్లో రౌడీల అగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా, కుర్రకారును ఉర్రూతలూగించే గ్లామర్ పాత్రల్లో లక్మీ రాయ్ తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించిందన్నారు.
విజయశాంతి నటించిన కర్తవ్యం లాంటి సినిమాగా ఇది మైల్‌స్టోన్‌గా నిలుస్తుందన్న అంచనాలున్నాయి. కర్తవ్యం చిత్రంతో విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. కర్తవ్యం చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో, ఈ “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం కూడా ఘన విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నామని.. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 29న అత్యధిక థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని ఆర్‌కే గౌడ్ చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి విజయాన్ని అందించాలని కోరుతున్నాను అన్నారు.