తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి. ఈనెల 12వ తేదీన గవర్నర్ ప్రసంగంతో మొదలైన అసెంబ్లీ, శాసన మండలి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఈనెల 19వ తేదీన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం 11 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగించేందుకు స్పీకర్ తొలిరోజు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
ఇక, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన ఇవాళ.. పదకొండోరోజు శాసన సభ, శాసన మండలిలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం పది గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే, ఇవాళ ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు.
సభ ప్రారంభమయ్యాక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాగ్ రిపోర్ట్‌ను టేబుల్ చేస్తారు. అనంతరం శాసన మండలిలో కూడా కాగ్ రిపోర్ట్ టేబుల్ చేస్తారు. అనంతరం ప్రభుత్వం తీర్మానం చేయనుంది. మరోవైపు.. ఇవాళ మూడు బిల్లులపై శాసన సభలో చర్చ జరగనుంది. ‘ది తెలంగాణ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ బిల్ 2025’ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టి, చర్చించి, ఆమోదం కోసం కోరనున్నారు. అలాగే, ‘ద్రవ్య వినిమయ బిల్ 2025 నెంబర్ (నెం:1)’ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టి, చర్చించి, సభ ఆమోదం కోరనున్నారు. వీటితో పాటు.. ‘ద్రవ్య వినిమయ బిల్ 2025 (నెం:2)’ను కూడా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించి, సభ ఆమోదం కోరనున్నారు.