మధ్యంతర బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు పోలీసులు
పుష్ప 2 హిట్ టాక్ తో సంచలనం స్రుష్టించి వివాదాల పాలయిన ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ బెయిల్ రద్దు కానుందా? పోలీసులు అర్జున్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.ఈనెల 4న పుష్ప2 ప్రీమియర్ షో సందర్బంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగి, ఓ మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉండటం లాంటి పరిణామాలు అల్లు అర్జున్ అరెస్టుకు దారి తీశాయి. ఆ ఘటనకు తనకు సంబంధం లేదని , తన రాకపై ముందే థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చానని అల్లూ అర్జున్ చెబుతుంటే, పోలీసులకు తాము కూడా ముందే సమాచారం ఇచ్చామని కాబట్టి తమ తప్పు లేదని సంథ్యా థియేర్ యాజమాన్యం వాదిస్తోంది. మరోవైపు పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, అక్కడికొచ్చిన జనసందోహాన్ని అదుపు చేయాల్సిన పోలీసులు చేతులెత్తేసారని, ప్రేక్షక పాత్ర పోషించారనే విమర్శలొచ్చాయి. నేరంతో నేరుగాకానీ, నేరం జరిగేందుకు ప్రోత్సహించినట్లుగానీ ఆధారాలు లేనందున పోలీసుల అభియోగాలు చెల్లవని తెలంగాణ హై కోర్టు తేల్చి చెప్పింది.రూ. 50 వేల పూచీకత్తుతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
పోలీసుల లేఖ వైరల్
అయితే ఈ తీర్పుపై తీవ్ర అసంత్రుప్తిగా ఉన్న పోలీసులు తమ తప్పు లేదని నిరూపించే సాక్ష్యాల సేకరణలో పడ్డారు.సంధ్య థియేట్ కు ఇరువైపులా రెస్టారెంట్లు ఎక్కువగా ఉన్నందున, రాత్రివేళ రద్దీలో తాము బందో బస్తు నిర్వహించలేం కాబట్టి హీరోను అక్కడకు రావొద్దని చెప్పాలని సంధ్యథియేటర్ యాజమాన్యానికి రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆలస్యంగా నైనా తమ వాదనలను నిరూపించే ఆధారాలను తవ్వి తీసిన పోలీసులు వాటిసాయంతో అర్జున్ బెయిల్ రద్దు చేయాలని అతి తొందరలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది.
శ్రీతేజ్ ను కలుస్తా: అల్లు అర్జున్
మరోవైపు ఘటనలో తీవ్రంగా గాయపడి వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబాన్నిఅన్ని విధాల ఆదుకుంటామని, ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని అల్లు అర్జున్ ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని కలసి పరామర్శించాలని ఉన్నా.. తన న్యాయ నిపుణులు ఇప్పుడు సరైన సమయం కాదనడంతో ఆగి పోయినట్లు అర్జున్ ప్రకటించారు. భవిష్యత్తులో శ్రీతేజ్ కుటుంబానికి తాను అండగా ఉంటానని ప్రకటించారు. లీగల్ ఇబ్బందులు ఒక కొలిక్కి వచ్చాక తప్పకుండా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని తెలిపారు.