- దక్షిణ కొరియాలో ప్రపంచ దేశాల సదస్సు
- ప్లాస్టిక్ కట్టడికి ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వస్తాయా…?
- మనిషి శరీరంలోకి ఏటా 250 గ్రాముల ప్లాస్టిక్
మీకు ఒక విషయం తెలుసా ? ఒక మనిషి సగటున వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ ని తింటున్నాడు. అది ఎంతంటే.. మనం వాడే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్టు ఎంత బరువో అంత. అదేదో నేరుగా తింటున్నాడని కాదు. మనకి తెలీకుండానే ఆ స్థాయిలో ప్లాస్టిక్ కణాలు పొట్టలోకి వెళ్లిపోతున్నాయి. పర్యావరణాన్ని, మనిషి ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడానికి 175 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు దక్షిణ కొరియా బూసాన్ లో సోమవారం నుంచి సమావేశమయ్యారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు ఆరు రోజుల పాటు ప్లాస్టిక్ వినియోగంపై విస్తృతంగా చర్చలు జరుపుతారు. ప్లాస్టిక్ కాలుష్యం నుంచి ప్రపంచ దేశాలను కాపాడుకోవడానికి ఈ సదస్సులో ఒక ఒప్పందం కుదరనుంది. ప్లాస్టిక్ నిర్మూలన కోసం కచ్చితంగా ఒక ఒప్పందం కుదరాలని ఐక్యరాజ్య సమితి గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల జరిగిన కాప్ 29 వాతావరణ మార్పుల సదస్సులో కూడా కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తున్న ధనిక దేశాలు , కాలుష్యాన్ని అరికట్టం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే ఏదో మొక్కుబడిగా ఆర్థిక ప్యాకేజీ ఇచ్చారన్న విమర్శలున్నాయి.ఇప్పుడు ప్లాస్టిక్ పై సదస్సులోనైనా ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి వస్తాయా అన్న అనుమానాలైతే ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకం అనేది ఇప్పుడు మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతీ పనిలోనూ ప్లాస్టిక్ తో తయారైన వస్తువులనే వాడుతున్నాం. ఉదయం నిద్ర లేవగానే పళ్లు తోమాలంటే పేస్ట్, బ్రష్ ప్లాస్టిక్‌వే. స్నానానికి వాడే నీళ్ల బక్కెట్లు, సబ్బులు, షాంపూలు అంతా ప్లాస్టిక్ మయం. పాలు, సరుకులు, కూరగాయలు ఇలా ఇంటికి కావల్సిన నిత్యావసరాలన్నీ ప్లాస్టిక్ సంచుల్లోనే ఇస్తారు. ప్యాకేజీ రంగాన్ని ప్లాస్టిక్ లేనిదే ఊహించుకోలేం. అంతలా ప్లాస్టిక్‌కు మనం అలవాటు పడిపోయాము. ప్రతి నిత్యం ప్లాస్టిక్ వాడకం వల్ల తీసుకునే ఆహారం, తాగే నీళ్లు, పీల్చే గాలి ద్వారా ప్లాస్టిక్‌లో సూక్ష్మ కణాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. మన రక్తంలో కూడా ప్లాస్టిక్ నానో కణాలు చేరిపోతున్నాయి. ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైనవి తల్లి పాలు అని అనుకుంటాం కదా, అవి కూడా ప్లాస్టిక్‌తో కలుషితమైపోయాయని ఇటలీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో 2020లోనే వెల్లడైంది. గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఛారిటీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రకారం ఒక మనిషి సగటున వారంలో 2 వేల ప్లాస్టిక్ కణాలను తింటున్నాడు. అదే ఒక నెలకి అంటే 21 గ్రాములు.
ఏడాదిలో 250 గ్రాములకు పైగా ప్లాస్టిక్ మనిషి శరీరంలోకి వెళుతోంది.
కొండలు, గుట్టలు,అడవులు చివరికి సముద్ర గర్భాలు కూడా ప్లాస్టిక్ తో నిండిపోయాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ తరాల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.
1950 నుంచి ప్రపంచ దేశాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు
10 బిలియన్ టన్నులు
ఈ వ్యర్థాల్లో 11% నదులు, సముద్రంలో కలిసిపోతోంది.
2019లో ప్రపంచంలో ఉత్పత్తి అయిన ప్లాస్టిక్
234 మిలియన్ టన్నులు
2020లో ఉత్పత్తి అయినది
460 మిలియన్ టన్నులు
2060 నాటికి ఈ ఉత్పత్తి మరో మూడు రెట్లు పెరిగిపోతుందని అంచనాలున్నాయి.
ఇలా ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతూ ఉంటే ఆకాశంలో ఏర్పడే మేఘాలు కూడా ప్లాస్టిక్ కణాలతో నిండిపోయి కురిసే వర్షం కూడా ప్లాస్టిక్ కణాలతో నిండిపోతుందని అన్న ఆందోళనలున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ పరిస్థితి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే జరిగితే భూమి ఒక ప్లాస్టిక్ గోళంగా మారిపోయే ప్రమాదం ఉంది. బూసాన్ సదస్సు అయినా దీనికో పరిష్కారం ఇస్తుందని ఆశిద్దాం.