ట్రెండింగ్ లో న్యూజీలాండ్ మూలవాసీ తెగ మావోరీ ఎంపీల హాకా నృత్యం
ప్రంపచ దృష్టిని ఆకర్షించిన న్యూజీలాండ్ యువ ఎంపీ మాపి క్లార్క్ నిరసన
తమదైన సాంప్రదాయ యుద్ద నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న మావోరీ ఎంపీలు
గడచిన వారం పది రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న అంశం న్యూజీల్యాండ్ పార్లమెంటులో ఆ దేశ మూలవాసీలైన మావోరీ తెగకు చెందిన ఎంపీలు చేసిన నిరసన ప్రదర్శన. ఈ నిరసన సందర్భంగా వారు చేసిన ప్రదర్శనను ‘హాకా‘ అని అంటారు. యుద్ద సమయంలో ప్రత్యర్ధి పక్షాన్ని రెచ్చగొట్టడానికి ఈ విధమైన హాకా సాంప్రదాయ పద్దతిలో యుద్ద నృత్య ప్రదర్శన చేస్తారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యేలా ముఖకవళికలతో భావ వ్యక్తీకరణ చేసి ప్రత్యర్ధుల గుండెల్లో భయాందోళనలు కలిగించడం ఈ హకా నృత్యం ముఖ్య ఉద్దేశం.
ఇక ట్రెండింగ్ వీడియో విషయానికి వస్తే న్యూజీలాండ్ దేశాన్ని యూరోపియన్లు ఆక్రమించుకుని మూలవాసీలైన మావోరీల ఉనికి ప్రశ్నార్ధకం చేస్తున్నారని ఎప్పటి నుంచో మావోరీ తెగ ప్రజలు ప్రతి సందర్భంలో నిరసనలు తెలియజేస్తూ ఉంటారు. తాజాగా న్యూజీలాండ్ పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ‘బ్రిటీష్ మరియు స్వదేశీ మావోరీల మధ్య 184 ఏళ్ల నాటి ఒప్పందాన్ని పునర్నిర్వచించే వివాదాస్పద బిల్లు‘ తమ తెగ మనుగడకి విఘాతం కలిగిస్తుందని సభలోనే ఈ విధమైన నిరసనకు దిగారు మావోరీ ఎంపీలు. ప్రధానంగా ఒక యువ మహిళా ఎంపీ బిల్లును అడ్డంగా చింపుతూ ఆగ్రహ హవ, భావ వ్యక్తీకరణతో హాకా ప్రదర్శన చెయ్యడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ యువ మావోరీ మహిళా ఎంపీ పేరు హనా రౌహితీ కరియరికీ మాపి క్లార్క్. హనా రౌహితీ తన చేతిలో ఉన్న బిల్లు కాగితాలను చింపుతూ నిరసన ప్రారంభించిన వెంటనే ఆమె ముందు వరుసలో ఉన్న మరో ఇద్దరు ఎంపీలు సైతం పోడియంలోకి వచ్చి తమదైన సాంప్రదాయ రీతితో నృత్యం చేశారు. సభలో ఉన్న మావోరీ తెగకు చెందిన ఎంపీలు అందరూ వీరితో గొంతు కలిపి సంఘీభావం ప్రకటించారు. మావోరీ ఎంపీల హకా ప్రదర్శనకు మద్దతుగా గ్యాలరీలో ఉన్న ఆ తెగ ప్రజలు సైతం ఎంపీల హాకా ప్రదర్శనలో గొంతు కలిపి సాంప్రదాయ నృత్యం చేస్తూ మద్దతు పలికారు.
అయితే మావోరీ ఎంపీల ఈ ప్రదర్శనపై న్యూజీలాండ్ లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రకమైన రాడికల్ నిరసనలు సమస్యను పరిష్కరించలేవని మీడియాలో కధానాలు ప్రచురిస్తున్నారు. ఇది శాసన ప్రక్రియకు విఘాతం కలిగించడమే అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా న్యూజీలాండ్ పార్లమెంటులో జరిగిన మావోరీ ఎంపీల నిరసన ప్రదర్శనతో యువ మహిళా ఎంపీ మాపి క్లార్క్ గత పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ట్రెండ్ అవుతున్నారు.