ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(బుధవారం) వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రికి పూజారులు గుడి ప్రాశస్త్యం వివరించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన రేవంత్ రెడ్డి వేములవాడ పట్టణాభివృద్ధికి వరాల జల్లు కురిపించారు. అదే రోజు వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి కోసం వరాలు ప్రకటించారు. ఇప్పటికే రూ.127.65 కోట్లు మంజూరు చేసి, ఉత్తర్వులు జారీ చేసింది.
వీటిలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ.47.85 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం అందచేశారు. మేడిపల్లిలో జూనియర్ కళాశాల, రుద్రంగిలో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
సిరిసిల్ల కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వేములవాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాకతో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు.