సాంకేతికత అందుబాటులోకి రాని కాలంలోనే భారత దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి దివంగత మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ పాత్ర కీలకపాత్ర పోషించారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారని తెలిపారు. మంగళవారం భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. దేశ సమగ్రతపై అవగాహన లేళ్లే కావాలని తప్పుడు సినిమాలు చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారన్నారు. అసలు చరిత్ర తెలిసిన వాళ్లెవరైనా ఇందిరకు చేతులు ఎత్తి నమస్కరిస్తారని తెలిపారు.
ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే తెలంగాణలో మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం నెలకు రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఆశయ స్పూర్తితో ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇక, తెలంగాణలో బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే ఈ సర్వేచేస్తున్నామని చెప్పారు. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలనేది ఈ సమగ్ర సర్వే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అందరికీ నచ్చ చెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటామని.. కొద్దిమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.